SBI Electoral Bonds Supreme Court :ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత 26 రోజులుగా ఏం చేశారంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు జూన్ 30 వరకు గడువును పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మార్చి 12న(మంగళవారం) బ్యాంకు పని వేళలు ముగిసేలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని ఎస్బీఐని కోర్టు ఆదేశించింది. మార్చి 15 సాయంత్రం 5గంటలకల్లా ఎస్బీఐ ఇచ్చిన వివరాలను బహిరంగపరచాలని ఎన్నికల సంఘాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను మార్చి 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఆ సమాచారాన్ని మార్చి 13లోగా బహిరంగపరచాలని ఈసీకి స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్బీఐ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
"గత నెల ఇచ్చిన తీర్పు ప్రకారం విరాళాల వివరాలు వెల్లడించాలని మేం ఆదేశించాం. మీరు ఇలా అదనపు సమయం కోరుతూ మా దగ్గరకు రావడం చాలా తీవ్రమైన విషయం. మా తీర్పు స్పష్టంగా ఉంది. గత 26 రోజులుగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. మీ దరఖాస్తులో ఆ విషయాలు ఏవీ లేవు' అని ధర్మాసనం ఎస్బీఐని ప్రశ్నించింది. ఎస్బీఐ ఆ సీల్డ్ కవర్ను తెరిచి, ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
హర్షం వ్యక్తం చేసిన జయా ఠాకూర్
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు.' ఎలక్టోరల్ బాండ్ల విషయంపై ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పుపై నేను సంతోషిస్తున్నాను. ఈ సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకుని కోర్టు తగిన నిర్ణయం తీసుకుంది' అని పేర్కొన్నారు.