తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్ ఎంపీపై హత్యాయత్నం- తలకు తీవ్ర గాయం- అసలేం జరిగిందంటే? - ATTACK ON CONGRESS MP

బిహార్‌లోని సాసారాంలో కాంగ్రెస్ ఎంపీ‌పై హత్యాయత్నం- మనోజ్ కుమార్‌ తలకు తీవ్రగాయం

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2025, 9:00 PM IST

Attack On Congress MP :బిహార్‌లోని సాసారాంలో కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్‌పై హత్యాయత్నం జరిగింది. ఆగంతకులు ఆయన తలపై బలంగా దాడి చేశారు. దీంతో ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన కైమూర్ జిల్లా కుద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాతోపూర్ గ్రామ సమీపంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే- మనోజ్ కుమార్‌ సోదరుడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఎన్నికల్లో గెలిచారు. ఈ ఎన్నికల ఫలితం వెలువడిన తర్వాత ఎంపీ మనోజ్, ఆయన సోదరుడు కలిసి ఊరేగింపుగా బయలుదేరారు. వారి వాహన కాన్వాయ్ స్థానిక పాఠశాల సమీపంలోకి చేరుకోగానే, ఎంపీకి చెందిన బస్సు డ్రైవరుకు, పలువురు వ్యక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వారికి సర్దిచెప్పేందుకు వెళ్లిన ఎంపీ మనోజ్‌కుమార్‌‌పై ఆగంతకులు దాడి చేశారు. దీంతో ఆయన తలకు గాయమైంది. దీనిపై సమాచారం అందిన వెంటనే కైమూర్ జిల్లా ఎస్పీ, మోహానియా పట్టణ డీఎస్పీ, మోహానియా పట్టణ ఎస్‌డీఎంతో పాటు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎంపీని చికిత్స నిమిత్తం మొహానియా పట్టణంలోని సబ్‌డివిజనల్‌ ఆస్పత్రికి తరలించారు.

ఎంపీ మనోజ్ కుమార్‌ సోదరుడు ఏమన్నారంటే?
"ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఎన్నికల ఫలితం వచ్చాక మేము విజయోత్సవ ర్యాలీని మొదలుపెట్టాం. మార్గం మధ్యలో కొందరు వచ్చి, మా బస్సు డ్రైవర్‌పై దాడి చేశారు. దీంతో సోదరుడు మనోజ్ వెళ్లి ఆ గొడవను ఆపారు. ఆ వెంటనే కొందరు దుండగులు కర్రలు, ఈటలతో అక్కడికి చేరుకొని నానా హంగామా చేశారు. గొడవలు వద్దని మా సోదరుడు (ఎంపీ మనోజ్) వారిస్తుండగా ఆయన తలపై బలంగా కొట్టారు" అని ఎంపీ మనోజ్ కుమార్‌ సోదరుడు వివరించారు.

ఇరువర్గాల వాదనలు విన్న తర్వాతే!: జిల్లా ఎస్పీ హరిమోహన్ శుక్లా
దీనిపై పోలీసుల వాదన మరోలా ఉంది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాతే ఈ ఘటనకు అసలు కారణం ఏమిటో తెలుస్తుందని కైమూర్ జిల్లా ఎస్పీ హరిమోహన్ శుక్లా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎంపీతో పాటు మరొకరికి గాయాలైనట్లు తెలిసిందన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

అర డజను మందికిపైగా గాయపడ్డారు : డీఎస్పీ ప్రదీప్ కుమార్
"నాతోపూర్ గ్రామ సమీపంలో ఉన్న పాఠశాల విషయంలో భరిగావ్‌ గ్రామానికి చెందిన వారితో వివాదం నడుస్తోందని మేం గుర్తించాం. అక్కడ జరిగిన గొడవలోనే ఎంపీపై దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు అర డజను మందికిపైగా గాయపడ్డారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇంకా ఎవరీ అరెస్టు చేయలేదు" అని మోహానియా డీఎస్పీ ప్రదీప్ కుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details