Same Name Candidates In Bengaluru : సార్వత్రిక ఎన్నికల సమరంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. గెలుపునకు ఉన్న ఏ అవకాశాలను విడిచి పెట్టకుండా పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో ఉన్న వారి పేర్లే ఇప్పుపడు తలనొప్పిగా మారాయి. అదే పేర్లు మీద ఉన్న కొంతమందిని ఎన్నికల్లో బరిలోకి దింపి ఓట్లు చీల్చే వ్యుహాన్ని అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న అధికార కాంగ్రెస్, ఈ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ ఈ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి.
బరిలో ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులు
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. దక్షిణాదిలో మంచి పట్టున్న కర్ణాటకలో అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ప్రతిపక్ష బీజేపీ కూడా పట్టుదలతో ఉంది. ఇప్పటికే జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ మొత్తం 28 నియోజకవర్గాల్లో గెలుపొందేందుకు వ్యూహరచన చేస్తోంది. రెండు పార్టీలు విభిన్న ఎన్నికల వ్యూహంతో దూసుకెళ్తున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీ అభ్యర్థులను స్వంతంత్ర అభ్యర్థులుగా బరిలో దింపుతున్నారు. ఒకే పేరున్న అభ్యర్థిని బరిలో దింపి ఓట్లను చీల్చేందుకు వ్యూహం అమలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో వార్తల్లో నిలుస్తున్న బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో కూడా ఇదే వ్యూహాన్ని ఇరు పార్టీలు అమలు చేస్తున్నాయి. మంజునాథ్ పేరుతో ఐదు, సురేష్ పేరుతో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి.
బెంగళూరులో ఇలా
బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేష్, బీజేపీ అభ్యర్థి డాక్టర్ సీఎన్ మంజునాథ్ మధ్య ప్రధాన పోరు నడుస్తోంది. ఇప్పుడు ఇరు పార్టీలు అదే పేరుతో ఉన్న అభ్యర్థులను బరిలోకి దింపాయి. బీజేపీ అభ్యర్థి డాక్టర్ సీఎన్ మంజునాథ్ పేరుతో ఉన్న సి. మంజునాథ్, ఎన్. మంజునాథ్, మంజునాథ్.కె, సి.ఎన్. మంజునాథ్ ఇదే నియోజకవర్గం నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేష్ పేరుతో ఉన్న ఎన్.సురేష్ బరిలో నిలిచారు. ఇలాగే మాజీ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ బరిలో ఉన్న నియోజకవర్గంలో అదే పేరుతో ఉన్న డి. సుధాకర్, కె. సుధాకర్ నామినేషన్లు వేశారు. చిక్కబళ్లాపూర్‌లో కాంగ్రెస్‌కు చెందిన రక్షా రామయ్యపై మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. చిక్కమగలూరులో సురేష్‌పై బీజేపీ అభ్యర్థి కోట శ్రీనివాస్ పూజారి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే పేరుతో పూజారి, సుప్రీత్ పూజారి నామపత్రాలు దాఖలు చేసి ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్‌కు చెందిన ముద్ద హనుమేగౌడపై కూడా అదే పేరుతో ఉన్న వారు పోటీ చేస్తున్నారు.