Republic Day 2024 Celebration :75వ భారత గణతంత్ర వేడుకలు దిల్లీలో ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంప్రదాయ బగ్గీలో ఇరువురు దేశాధినేతలు కర్తవ్యపథ్‌కు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు, ప్రజలు ఈ వేడుకలో భాగమయ్యారు.
కర్తవ్యవథ్లో రిపబ్లిక్ డే పరేడ్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించిన త్రివిధ దళాలు- అత్యాధునిక ఆయుధాలను ప్రదర్శించాయి. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటేలా ప్రదర్శన సాగింది. సైనికుల కవాతు ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వ విభాగాలు ప్రదర్శించిన శకటాలు పరేడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నారీశక్తి, ఆత్మనిర్భరత థీమ్‌తో నేవీ శకటం ప్రదర్శించింది. 'సక్షమ్, సశక్త్, ఆత్మనిర్భర్' ఇతివృత్తంతో భారతీయ వాయుసేన శకటం ఆకట్టుకుంది. వాయుసేనకు చెందిన నాలుగు ఎంఐ17IV హెలికాప్టర్ల విన్యాసాలు అబ్బురపరిచాయి. కర్తవ్యపథ్‌పై ఎగురుతూ 'ధ్వజ్' ఆకారంలో ఎగురుతూ విన్యాసాలు చేశాయి.
వందే భారత్ డ్యాన్స్!
వేడుకల్లో భాగంగా 1,500 మంది మహిళలు వందే భారతం నృత్య ప్రదర్శన నిర్వహించారు. అన్ని రాష్ట్రాల సంస్కృతి ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శన సాగింది. 1500 డ్యాన్సర్లు కలిసి 30 రకాల జానపద నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
ఇస్రో చంద్రయాన్-3 శకటం
జీ20 ఇతివృత్తంతో విదేశాంగ శాఖ శకటాన్ని ప్రదర్శించింది. జీ20 కూటమి లోగో, సభ్య దేశాల జెండాలతో కూడిన శకటాన్ని రూపొందించింది. 'మహిళల నాయకత్వంలో అభివృద్ధి' అనే నినాదం ఇచ్చింది. దేశ సంస్కృతికి అద్దం పట్టేలా ఉన్న కేంద్ర హోంశాఖ శకటం ఆకట్టుకుంది. చంద్రయాన్-3 విజయం ఇతివృత్తంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శకటం ప్రదర్శించింది. వికసిత్ భారత్ ధీమ్‌తో CSIR ప్రదర్శించిన రోబో శకటం కూడా ఆకట్టుకుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పౌరులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే థీమ్‌తో కేంద్ర ఎన్నికల సంఘం శకటాన్ని ప్రదర్శించింది.
పరేడ్‌లో నారీశక్తి
రిపబ్లిక్ డే పరేడ్‌లో నారీశక్తి స్ఫూర్తి పరిఢవిల్లింది. మహిళా సైనికుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీఎస్ఎఫ్ బృందానికి అసిస్టెంట్ కమాండెంట్ మోనికా లక్రా నాయకత్వం వహించారు. కానిస్టేబుల్ అంబికా పాటిల్ నేతృత్వంలో ఐటీబీపీ బ్యాండ్ కవాతు సాగింది. దిల్లీ పోలీసు శాఖ తరఫున పూర్తిగా మహిళలతో కూడిన బృందం పరేడ్‌లో పాల్గొంది.
ఆకట్టుకున్న వివిధ రాష్ట్రాల శకటాలు
రాష్ట్ర ప్రగతి, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను చాటేలా వివిధ రాష్ట్రాలు శకటాలు ప్రదర్శించాయి. అయోధ్య రామాలయ ప్రత్యేకతను తలపించేలా ఉత్తర్‌ప్రదేశ్ ప్రదర్శించిన శకటం ఆకట్టుకుంది. బాల రాముడి ప్రతిమతో పాటు శాస్త్ర, సాంకేతిక అభివృద్ధికి సంబంధించిన నమూనాలతో యూపీ శకటం ప్రత్యేకంగా నిలిచింది. ఆదర్శ మహిళల ఇతివృత్తంతో మధ్యప్రదేశ్ శకటం, మహిళా హస్తకళా వృత్తులకు గుర్తుగా రాజస్థాన్ శకటం, మహిళా సాధికారత ప్రోత్సహించేలా ఒడిశా శకటాలు పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రాష్ట్రపతి- గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఫ్రాన్స్ ప్రధాని మెక్రాన్
భారత్‌కు ప్రపంచ దేశాల రిపబ్లిక్ డే శుభాకాంక్షలు- రష్యా స్పెషల్ విషెస్!