Republic Day 2024 Celebration In Delhi :75వ గణతంత్ర వేడుకల సందర్భంగా దేశ రాజధాని దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు.
అంతకుముందు జాతీయ వార్ మెమోరియల్‌ను ప్రధాని మోదీ సందర్శించడంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. దిల్లీలో యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు ప్రధాని శాల్యూట్ చేశారు. వారి సేవలను కొనియాడుతూ అక్కడి పుస్తకంలో సంతకం చేశారు. ఆ తరువాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 40ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గీని వినియోగించారు. కర్తవ్యపథ్‌కు చేరుకున్న తర్వాత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత పరేడ్, శకటాల ప్రదర్శన జరిగింది.
ఈ సారి జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. 'ఆవాహన్'తో పరేడ్ చేశారు. ఇందులో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. అందులో సంప్రదాయ బ్యాండ్‌కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో ప్రదర్శన ఇచ్చారు.
ఆకట్టుకున్న ఫ్రెంచ్ బ్యాండ్
గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకాగా ఫ్రెంచ్ సైన్యం, సైనిక బ్యాండ్ సైతం దిల్లీ వేడుకల్లో పాల్గొంది. కెప్టెన్ ఖోర్డా నేతృత్వంలో ఫ్రెంచ్ సైనిక బ్యాండ్ కనువిందు చేసింది. కెప్టెన్ నోయిల్ ఆధ‌్వర్యంలో రెండో విదేశీ ఇన్‌ఫ్రాంటీ రెజిమెంట్‌గా ఫ్రెంచ్ సైన్యం పరేడ్‌లో పాల్గొంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పాటు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు వందనం సమర్పించింది.
ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు
Republic Day Wishes 2024 :75వ గణతంత్ర వేడుకల సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్రమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. బలమైన మరింత సంపన్నమైన భారత్‌ను నిర్మించేందుకు కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో విరాజిల్లే దేశం భారత్ అని అన్నారు. రాజ్యాంగ సూత్రాలను మరోసారి మననం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. జాతీయ నాయకుల స్ఫూర్తితో ముందుకుసాగాలని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు, వీర సైనికులందరినీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్మరించుకున్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ప్రజాస్వామ్య విలువలను రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేద్దామంటూ అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు.
మరోవైపు, దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ చరిత్రాత్మక రోజు సందర్భంగా భారత్‌ను మరింత బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.