Renuka Swamy Murder Case :రేణుకాస్వామిని హత్య చేసిన అనంతరం హడావుడిగా ఆధారాలను మాయం చేసేందుకు సినీనటుడు దర్శన్ తీవ్రంగా యత్నించినట్లు తేలింది. ఈ క్రమంలో అతడు తన స్నేహితుడి వద్ద 40 లక్షల రూపాయలు అప్పు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దర్శన్‌తో పాటు మరో ముగ్గురు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. పవిత్ర గౌడతో పాటు మిగతా నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
పవిత్ర గౌడ ప్రధాన కారణం!
దర్శన్‌తో పాటు ధన్‌రాజ్, వినయ్, ప్రదోష్ విచారణకు సహకరించలేదని, వాస్తవాలను దాచేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు. రేణుకాస్వామి హత్యకు పవిత్ర గౌడ ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. ఆమే ఇతర నిందితులను ప్రేరేపించి, వారితో కుట్ర చేసి, నేరంలో పాల్గొన్నట్లు తేల్చారు. రేణుకాస్వామి హత్యలో దర్శన్ స్వయంగా పాల్గొని, ఆధారాలను ధ్వంసం చేసేందుకు యత్నించి చట్టాన్ని అతిక్రమించాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్ షాక్ టార్చ్‌ను ఉపయోగించి!
రేణుకాస్వామి హత్య కేసులో ఏ9గా ఉన్న ధన్‌రాజ్ పోలీసులకు స్వచ్ఛందంగా ఇచ్చిన వాంగ్మూలంలో పలు విషయాలను వెల్లడించాడు. బాధితుడిపై దాడి చేసి, కరెంట్ షాక్ ఇచ్చేందుకు ఎలక్ట్రిక్ షాక్ టార్చ్‌ను ఉపయోగించినట్లు తెలిపాడు. అయితే ఆ పరికరాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మాత్రం వెల్లడించలేదని, ఆ విషయాన్ని తెలుసుకునేందుకు కస్టడీకి అప్పగించాలని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హత్య అనంతరం దర్శన్ అనేక మందిని సంప్రదించాడని పోలీసులు తెలిపారు.
రూ.40 లక్షలు తీసుకుని మరీ!
దీని వెనుక ఉన్న ఉద్దేశాన్ని, కారణాలను తెలుసుకునేందుకు అతడిని విచారించాల్సి ఉందన్నారు. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి కొందరు పెద్దలు ప్రయత్నించగా పోలీసులు అడ్డు చెప్పినట్లు సమాచారం. చట్టం నుంచి తప్పించుకోవడానికి, సాక్ష్యాలను మాయం చేయడానికి తన స్నేహితుడు మోహన్ రాజా నుంచి రూ.40 లక్షలు తీసుకున్నట్లు దర్శన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడని తెలిసింది. దర్శన్ నివాసంలో రూ.37.4 లక్షలు, భార్య విజయలక్ష్మి దగ్గర నుంచి రూ.3 లక్షలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.