Ramdev Baba Misleading Ads Case: తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో బేషరతుగా క్షమాపణలు చెబుతూ యోగా గురువు రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఎండీ ఆచార్య బాలకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్‌లను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు మళ్లీ నిరాకరించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు అంత ఉదారంగా వ్యవహరించాలనుకోవడం లేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పతంజలి ధిక్కరణ కేసులో బుధవారం విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
ముగ్గురు అధికారులు సస్పెండ్
తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో చర్యలు తీసుకోనందుకు ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీని సైతం సుప్రీంకోర్టు మందలించింది. పదే పదే ఉల్లంఘనలు జరుగుతున్నా హెచ్చరించి విడిచిపెట్టడం తప్ప అధికారులు చర్యలు తీసుకోకుండా ఎందుకు మిన్నకుండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. లైసెన్సింగ్ అథారిటీలో ఉన్న ముగ్గురు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఇది కేవలం ఒక ఎఫ్‌ఎంసీజీ కంపెనీకి సంబంధించిన వ్యవహారం కాదని, న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందనే విషయం సమాజంలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని ధర్మాసం పేర్కొంది.
మీ క్షమాపణలపై నమ్మకం లేదు
'మీరు కోర్టు పట్ల ఏ విధంగా అయితే అలక్ష్యంగా వ్యవహరించారో అలానే మీ క్షమాపణ పట్ల మేమెందుకు వ్యవహరించకూడదు? మీ క్షమాపణ మీద మాకు నమ్మకం లేదు. దాన్ని తిరస్కరిస్తున్నాం. మాకు క్షమాపణలు చెప్పడానికి ముందే వారు (రామ్‌దేవ్, బాలకృష్ణ) తమ అఫిడవిట్లను మీడియాకు పంపారు. మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు అవి మాకు అప్‌లోడ్ అవ్వలేదు. దీనిని చూస్తే ప్రచారం కోరుకుంటున్నారని అర్థం అవుతోంది' అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.