Rajasthan Surya Namaskar :రాజస్థాన్‌లో ఒకేసారి కోటి మందికి పైగా సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలోని 88 వేల పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమంలో 1.14 కోట్ల మంది విద్యార్థులు సహా 1.33 కోట్ల మంది పాల్గొని సూర్య నమస్కారాలు చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర స్కూళ్లలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి నవీన్ జైన్ తెలిపారు. గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. 88,974 పాఠశాలలకు చెందిన కోటి 14 లక్షల 69 వేల 914 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా శాఖ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. విద్యార్థులతో కలిపి మొత్తంగా కోటి 33 లక్షల 50 వేల 889 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో భాగమయ్యారని చెప్పారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్
రథసప్తమి నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎక్కువ మంది పాల్గొని సూర్య నమస్కారాలు చేసిన కార్యక్రమంగా దీనికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. ఈ మేరకు రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు ప్రథమ్ భల్లా రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యా శాఖ అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, రాష్ట్ర ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.