Rajanth Singh On Agnipath Scheme :ప్రస్తుతం అమలవుతున్న అగ్నిపథ్ లేదా అగ్నివీర్ రిక్రూట్మెంట్ స్కీమ్‌లో అవసరమైతే మార్పులు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. గురువారం టైమ్స్ నౌ సమ్మిట్‌లో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అగ్నివీరుల భవిష్యత్తులను సురక్షితంగా ఉంచేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి హామీ ఇచ్చారు.
రక్షణ దళాల్లో యువతరం ప్రాధాన్యాన్ని వివరించిన మంత్రి అగ్నివీర్ పథకాన్ని మరోమారు సమర్థించారు. సేనా మే యూత్‌ఫుల్‌నెస్ హోనీ చాహియే (సైన్యంలో యువత ఉండాలి) అని అన్నారు. 'దీని పట్ల ప్రస్తుత యువతరం ఉత్సాహంగా ఉందని నేను భావిస్తున్నా. వీరంతా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగినవారని నమ్ముతున్నా. ఈ పథకం (అగ్నివీర్)లో భాగంగా వీరి భవిష్యత్తులను సురక్షితంగా ఉంచేందుకు మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అవసరమైతే మరిన్ని మార్పులు చేసేందుకు కూడా కట్టుబడి ఉన్నాం' అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.
Agnipath Scheme :త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం 2022 జూన్‌లో 'అగ్నిపథ్' పథకాన్ని ప్రకటించింది. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. నాలుగేళ్లు మాత్రమే సర్వీస్ అంటూ కేంద్రం తమను పిచ్చివాళ్లను చేస్తోందని సైనిక నియామక రిక్రూట్‌మెంట్‌కు సిద్ధం అవుతున్న పలువురు యువకులు మండిపడ్డారు.
ఈ పథకం కింద నియమితులైన యువతీయువకులను అగ్నివీరులుగా పిలుస్తారు. వీరు 4 సంవత్సరాల పాటు సర్వీసులో ఉంటారు. ఇందులోనే 6 నెలల శిక్షణా కాలంతో పాటు 3.5 ఏళ్ల ఉద్యోగం ఉంటుంది. నాలుగు ఏళ్ల తర్వాత సర్వీసు నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత సాయుధ దళాల్లోనే కొనసాగేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం వీరికి (అగ్నివీరులకు) ఉంటుంది.