Rahul Gandhi Gave Clarity On His Shakti Comments :ఆదివారం ముంబయిలో విపక్ష కూటమి ఇండియా నేతలు హాజరైన సభలో 'శక్తి' పేరిట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి. రాహుల్ వ్యాఖ్యలను పలు రాష్ట్రాల్లోని బీజేపీ ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. తాజాగా దీనిపై రాహుల్ స్పందించారు. అయితే 'శక్తి' పేరుతో తాను చేసిన వ్యాఖ్యలను ఏ హైందవత్వానికో లేదా సదరు మతానికో ఆపాదించవద్దని, తాను ఎన్డీఏ అనే 'రాజకీయ శక్తి'తో యుద్ధం అనే ఉద్దేశంతో మాత్రమే మాట్లాడానని రాహుల్ సోమవారం వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను ప్రధాని మోదీ వేరే విధంగా వక్రీకరించి, దేవతలకు సంబంధించిన శక్తి అనే పదంతో ముడిపెట్టి తన ప్రసంగాల్లో వాడుకుంటున్నారని రాహుల్ దుయ్యబట్టారు.
"నేను మతానికి సంబంధించిన శక్తి గురించి అనలేదు. అధర్మం, అవినీతి, అబద్ధాలతో కూడిన బీజేపీ లేదా రాజకీయ శక్తి గురించి మాత్రమే మాట్లాడాను. ఇందులో భాగంగానే 'శక్తికి వ్యతిరేకంగా పోరాటం' అనే వ్యాఖ్యలు చేశాను. అయితే నేను లోతైన సత్యం మాట్లాడాను. దీనిని కప్పిపుచ్చుకోవడానికి ప్రధాని మోదీ నా మాటలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
'జూన్ 4న తేలిపోతుంది'
హిందూ ధర్మంలో శక్తి అనే శబ్ధం ఉంటుందని, ఓ శక్తితో తాము పోరాడుతున్నామని రాహుల్ వ్యాఖ్యానించగా, ప్రధాని మోదీ ఆ వ్యాఖ్యలను సోమవారం తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా పూజించే శక్తిని నాశనం చేయడమే విపక్ష కూటమి ఇండియా మేనిఫెస్టో అని మోదీ విమర్శించారు. ఎన్నికల సమరంలో శక్తిని పూజించే వారిది విజయమో, శక్తిని నాశనం చేసేవారిది విజయమో జూన్ 4వ తేదీన తేలిపోతుందన్నారు.
మాకు-వారికి యుద్ధం : మోదీ
మరోవైపు శక్తి అని పదాన్ని ఉపయోగించి రాహుల్ చేసిన విమర్శలపై కొందరు బీజేపీ నేతలూ మండిపడ్డారు. అందరూ పూజించే శక్తిని నాశనం చేస్తామని ఇండియా కూటమి మేనిఫెస్టో చెబుతోందని అన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని మోదీ రాహుల్పై విమర్శలు గుప్పించారు. ఈ సార్వత్రిక ఎన్నికల సమరాన్ని శక్తిని పూజించే వారు, శక్తిని నాశనం చేసేవారి మధ్య యుద్ధంగా అభివర్ణించారు.