Rahul Gandhi JH Election Campaign : ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. మోదీ సర్కార్ ఎన్నికల కమిషన్, సీబీఐ, ఈడీ, అదాయ పన్ను శాఖ, న్యాయశాఖ సహా, ప్రభుత్వ అధికారులను (బ్యూరోక్రసీ) నియంత్రిస్తోందని ఆరోపించారు. భారత రాజ్యాంగంపై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోందని, దానిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాంచీలో జరిగిన 'సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్'లో పాల్గొన్న రాహుల్ గాంధీ - ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలపై ఘాటు విమర్శలు చేశారు.
"రాజ్యాంగంపై అన్ని వైపుల నుంచి నిరంతరం దాడి జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాలు కూడా ఈ దాడి చేసినవారిలో ఉన్నారు. వీరి నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది."
- రాహుల్ గాంధీ
ఆదివాసీలపై మోదీ సర్కార్ వివక్ష
మోదీ సర్కార్ ఆదివాసీలపై వివక్ష చూపిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 'అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన మోదీ సర్కార్, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మాత్రం ఆహ్వానించలేదు. ఎందుకంటే ఆమె ఒక ఆదివాసి కావడమే' అని రాహుల్ గాంధీ అన్నారు.
"బీజేపీ 'ఆదివాసీ'లను కొత్తగా 'వనవాసీ'లు అంటోంది. ఆదివాసి అంటే మొదటి నుంచి ఉన్నవారు అని అర్థం. వనవాసి అంటే అటవీ ప్రాంతంలో జీవించేవారు అని అర్థం. ఈ విధంగా ఎంతో ఘనత కలిగిన ఆదివాసీల వారసత్వం, చరిత్ర, సంప్రదాయాలు, వైద్య విధానాలను ధ్వంసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది"
- రాహుల్ గాంధీ