తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరియాణాలో షాకింగ్​ రిజల్ట్స్​- EC దృష్టికి ఆ ఫిర్యాదులు: రాహుల్ గాంధీ - RAHUL GANDHI ON HARYANA ELECTIONS

హరియాణాలో వచ్చిన ఊహించని ఫలితాలపై విశ్లేషించుకుంటున్నామన్న రాహుల్ గాంధీ- పలు నియోజకవర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడి.

Rahul Gandhi About Haryana Elections
Rahul Gandhi About Haryana Elections (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2024, 12:56 PM IST

Rahul Gandhi About Haryana Elections :హరియాణా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. హరియాణాలో ఊహించని ఫలితాలు వచ్చాయని, వాటిని విశ్లేషించుకుంటున్నామని తెలిపారు. హరియాణాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్టు చేశారు.

"జమ్ముకశ్మీర్‌ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జమ్ముకశ్మీర్​లో ఎన్​సీ-కాంగ్రెస్ కూటమి గెలుపు, భారత రాజ్యాంగం సాధించిన విజయం. ప్రజాస్వామ్య ఆత్మగౌరవానికి దక్కిన విజయం. ఇక హరియాణాలో అనూహ్య ఫలితాలపై విశ్లేషించుకుంటున్నాం. హరియాణాలో పార్టీ కోసం నిరంతరం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థిక న్యాయం, నిజం కోసం మా పోరాటం కొనసాగుతుంది. ప్రజల గళాన్ని మేం వినిపిస్తూనే ఉంటాం. " అని రాహుల్ ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు.

రాహుల్​కు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
మరోవైపు, హరియాణా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై రాహుల్ స్పందనపై బీజేపీ కౌంటర్ వేసింది. రాహుల్‌ గాంధీ రాజవంశానికి చెందిన అపరిపక్వ నాయకుడని బీజేపీ నేత షెహజాద్ పునేవాలా తీవ్రంగా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు రాహుల్ ఎన్నికల సంఘంపైనా, మొత్తం ఎన్నికల ప్రక్రియపైనా ఆరోపణలు చేస్తుంటారని ఎద్దేవా చేశారు.

"హరియాణాలో కాంగ్రెస్ ఓటమిని రాహుల్ గాంధీ అంగీకరించరు. కాంగ్రెస్ కూటమి జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో గెలిచింది రాజ్యాంగం బాగానే ఉందంటారు. హరియాణాలో ఓడిపోతే, రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయిందంటారు. ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తారు. రాహుల్ గాంధీ జాతీయ ప్రయోజనాల కంటే తన కుటుంబ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారు. దీపిందర్ సింగ్ హుడ్డా, కుమారి సెల్జా ఓటమిని హుందాగా అంగీకరించారు" అని రాహుల్​పై బీజేపీ నేత షెహజాద్ పునేవాలా విమర్శలు గుప్పించారు.

ఖర్గేకి ఈసీ లేఖ
మరోవైపు,హరియాణా ఎన్నికల ఫలితాల వేళ ఈసీ పనితీరుతోపాటు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కమిషన్ తాజాగా లేఖ రాసింది. హరియాణా ఫలితాలు ఊహించనివిగా కాంగ్రెస్ పార్టీ చేసిన పలు ప్రకటనలను తాము పరిగణనలోకి తీసుకున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి రాసిన లేఖలో ఈసీ పేర్కొంది. ఫిర్యాదులు, అభ్యంతరాలతో తమను కలవాలని కోరింది. బుధవారం సాయంత్రం 6గంటలకు కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందాన్ని కలిసేందుకు అంగీకరిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు, కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్‌, అశోక్‌ గహ్లోత్‌, భూపీందర్‌ సింగ్‌ హుడ్డా, ప్రతాప్‌సింగ్‌ బాజ్వా, అభిషేక్‌ మనూ సింఘ్వి, జైరాం రమేశ్‌ తదితరులు ఈసీ అధికారులను కలవనున్నారు.

JK, హరియాణా రిజల్ట్స్​తో బీజేపీలో ఫుల్ జోష్​- నెక్స్ట్ టార్గెట్ మహారాష్ట్ర, ఝార్ఖండ్‌!

శ్రీలంక హెడ్ కోచ్​గా జయసూర్య - ఆ రిజల్ట్స్​ వల్లే న్యూ పోస్ట్!

ABOUT THE AUTHOR

...view details