తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న- మరో ఇద్దరికి కూడా - chowdary charan singh bharat ratna

PV Narasimha Rao Bharat Ratna
PV Narasimha Rao Bharat Ratna

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 12:49 PM IST

Updated : Feb 9, 2024, 2:55 PM IST

12:46 February 09

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న

PV Narasimha Rao Bharat Ratna :దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది. ఆయనతోపాటు మరో మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు కూడా అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ (ట్విట్టర్​) వేదికగా శుక్రవారం వెల్లడించారు. ఇప్పటికే బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌తోపాటు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్‌ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించింది కేంద్రం.

'దేశ అభివృద్ధికి పీవీ నాయకత్వం గట్టి పునాది'
దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడంలో పీవీ నరసింహారావు దార్శనిక నాయకత్వం కీలకపాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ కొనియాడారు. దేశ శ్రేయస్సుతోపాటు అభివృద్ధికి గట్టి పునాది వేసినట్లు పేర్కొన్నారు. క్లిష్టమైన పరివర్తిన ద్వారా దేశాన్ని ముందుకు నడిపారన్నారు. దేశ సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేశారని ప్రశంసించారు. "రాజనీతిజ్ఞుడిగా నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు, శాసనసభ సభ్యునిగా అసమాన కృషి చేశారు" అని మోదీ ట్వీట్​ చేశారు.

'చరణ్‌సింగ్‌ నిబద్ధత యావత్ జాతికి స్ఫూర్తిదాయకం'
మాజీ ప్రధాని చౌధరీ చరణ్‌ సింగ్‌ దేశానికి అసమాన సేవలు అందించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. "దేశ మాజీ ప్రధాని చౌధరీ చరణ్‌ సింగ్‌ను భారతరత్నతో సత్కరించడం మన ప్రభుత్వ అదృష్టం. దేశానికి ఆయన చేసిన ఎనలేని కృషికి ఈ గౌరవం అంకితం. ఆయన తన జీవితమంతా రైతుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం అంకితం చేశారు. ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశానికి హోంమంత్రిగా, ఎమ్మెల్యేగా సేవలందించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డారు. మన రైతు సోదర సోదరీమణుల పట్ల ఆయనకున్న అంకితభావం, ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత యావత్ జాతికి స్ఫూర్తిదాయకం" అంటూ మోదీ కొనియాడారు.

'స్వామినాథన్​ సేవలు అమోఘం'
వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధనతోపాటు ఆధునీకరణకు డాక్టర్ స్వామినాథన్‌ విశేషంగా కృషి చేసినట్లు మోదీ తెలిపారు. "వ్యవసాయ రంగంలో మన దేశానికి చేసిన స్మారక సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం డాక్టర్ ఎంఎస్​ స్వామినాథన్​కు భారతరత్న ప్రదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. వ్యవసాయంలో స్వావలంబన సాధించడంలో కీలక పాత్ర పోషించారు. వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయత్నాలు చేశారు. స్వామినాథన్ దార్శనిక నాయకత్వం భారతీయ వ్యవసాయాన్ని మార్చడమే కాకుండా దేశ ఆహార భద్రతతోపాటు శ్రేయస్సుకు హామీ ఇచ్చింది" అని మోదీ ట్వీట్​ చేశారు.

'ఇదే సముచిత నివాళి'
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌధరీ చరణ్​సింగ్​, శాస్త్రవేత్త ఎంఎస్ ​స్వామినాథన్​కు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించడంపై పలువురు రాజకీయ నాయకులు స్పందించారు. దేశ చరిత్రను తనదైన దృక్పథంతో రూపుదిద్దిన పురాణ రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం సముచిత నివాళి అని కేంద్ర హోంమంత్రి అమిత్​షా కొనియాడారు. అమిత్​ షాతోపాటు బీజేపీ జేపీ నడ్డా ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

'ఎప్పటికీ భారతరత్నాలే'
పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, స్వామినాథన్ ఎప్పటికీ భారత్ రత్నాలేనని కాంగ్రెస్ పార్టీ కొనియాడింది. వారు ముగ్గురికి అవార్డులు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్​ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ తెలిపారు. తన తండ్రి చౌధరీ చరణ్​ సింగ్​కు అత్యున్నత పురస్కారం దక్కినందుకు ఆయన కుమారుడు ఆర్​ఎల్​డీ చీఫ్​ జయంత్​ చౌధరీ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వాలు చేయలేని పనిని మోదీ చేసి చూపించారని కొనియాడారు.

'అప్పుడు ప్రకటించి ఉంటే విని సంతోషించేవారు'
ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ప్రకటించడంపై ఆయన కుమార్తె, మాజీ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ స్పందించారు. "నాన్న బతికి ఉన్నప్పుడు ఈ ప్రకటన వచ్చి ఉంటే ఆ వార్త విని సంతోషించేవారు. ఆయన ఎప్పుడూ అవార్డుల కోసం పనిచేయలేదు. గుర్తింపు కోసం ఎదురుచూడలేదు" అని సౌమ్య తెలిపారు. మరోవైపు, స్వామినాథన్‌కు భారతరత్న ప్రకటించినందుకు ప్రధాని మోదీకి ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌) కృతజ్ఞతలు తెలిపింది. ఆయన చేసిన అవిశ్రాంతమైన కృషికి ఇదే సరైన గుర్తింపు అని కొనియాడింది.

Last Updated : Feb 9, 2024, 2:55 PM IST

ABOUT THE AUTHOR

...view details