Pune Porsche Car Accident : పుణెలో మద్యం మత్తులో వేగంగా కారు నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతికి కారణమైన మైనర్ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడి రక్త నమూనాను తారుమారు చేసి అతడిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడి రక్తంలో ఆల్కహాల్ ఉందా లేదా అని తొలుత పరీక్షలు జరిపినప్పుడు వైద్యులు ఈ నిర్వాకం వెలగబెట్టినట్లు తెలిసింది.
ససూన్ ఆస్పత్రిలోని డాక్టర్ అజయ్ తావ్రే, డాక్టర్ శ్రీహరి హర్నార్ అనే వైద్యులు రక్తనమూనాలను తారుమారు చేసినట్లు పుణె క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ఫలితంగా తొలిసారి పరీక్షలు జరిపినప్పుడు మైనర్ రక్త నమునాను డస్ట్‌బిన్‌లో పడేసి, దాని స్థానంలో మరొకరి శాంపిల్ పెట్టారని పోలీసులు తెలిపారు. దీంతో మైనర్ రక్తంలో ఆల్కహాల్ లేదని నివేదికలు వచ్చాయి. పోలీసులు అరెస్టు చేసిన వారిలో అజయ్ తావ్రే అనే వైద్యుడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఫోరెన్సిక్ ల్యాబ్ హెడ్ అని గుర్తించారు. బాలుడిని రక్షించేందుకు విశాల్ అగర్వాల్ కుటుంబం పలుకుబడిని ఉపయోగించి వైద్యులను కూడా కొన్నారన్న ఆరోపణలను ఈ ఉదంతం బలపరుస్తోందని పోలీసులు వెల్లడించారు.
నమూనాలను మార్చమని చేప్పిన మైనర్ తండ్రి
రక్త నమూనాలను మార్చాలని వైద్యులకు బాలుడి తండ్రి చెప్పినట్లు దర్యాప్తులో తెలిందని పుణె పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ పేర్కొన్నారు. 'ప్రమాదం జరిగిన మొదట్లో బాలుడి రక్త నమూనాలో ఆల్కహాల్ ఆనవాలు లేవని నివేదిక వచ్చింది. అనుమానంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా నిందితుడు మిత్రులతో కలిసి మద్యం తాగినట్లు ఉంది. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు బయటకి వచ్చాయి. మే 19న సాసూన్ ఆస్పత్రిలో తీసిన రక్త నమూనాను ఆస్పత్రి డస్ట్‌బిన్‌లో పడేసి మరొకరివి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. డాక్టర్ అజయ్ తావ్రే సూచనల మేరకే డాక్టర్ శ్రీహరి హార్నూర్ ఈ నమూనాలను మార్చినట్లు తెలిసింది. అలా చేయమని డాక్టర్ అజయ్ తావ్రేకు బాలుడు తండ్రి చెప్పినట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం అసలు బ్లడ్ శాంపిల్ ఎవరివి తీసుకున్నారని అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం' అని అమితేశ్ కుమార్ తెలిపారు.