తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిరసనలు, గాయాలు, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు - పార్లమెంట్​లో అసలేం జరిగింది! - PARLIAMENT PROTEST

పార్లమెంట్‌ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం - పోటాపోటీగా నిరసనలు

Parliament Protest
Parliament Protest (ANI)

By ETV Bharat Telugu Team

Published : 10 hours ago

Parliament Protest : పార్లమెంట్‌ ప్రాంగణంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అటు అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం ఎంపీలు కూడా నిరసన చేపట్టారు. ఇరువర్గాల ఆందోళనలతో పార్లమెంట్‌ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందులో బీజేపీ చెందిన ఇద్దరు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

పోటాపోటీ నిరసనలు
అంబేడ్కర్‌ను అవమానించేలా మాట్లాడినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఇండి కూటమి ఎంపీలు నీలపు రంగు దుస్తులు, కండువాలతో ఆందోళనకు దిగారు. అంబేడ్కర్‌ ప్లకార్డులు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇతర ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. జైభీమ్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు మకర ద్వారం వద్ద బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ ఎంపీలు సైతం నిరసనకు దిగారు. అంబేడ్కర్‌ను అవమానించినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. అంబేడ్కర్‌ను అవమానించడం తగదని నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బాబాసాహెబ్‌ను గౌరవించలేదని ఆరోపించారు.

రాహుల్ వల్లే కింద పడ్డ
పోటాపోటీ ఆందోళనలు చేసే క్రమంలో పార్లమెంటు ఆవరణలో తీవ్ర గందరగోళం జరిగింది. ఎన్​డీఏ ఎంపీలు మకర ద్వారం వద్ద ఆందోళన కొనసాగిస్తుండగానే కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు లోపలికి వెళ్లేందుకు యత్నించడం వల్ల తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్‌ చంద్ర సారంగి, యూపీలోని ఫర్రూఖాబాద్‌ ఎంపీ ముకేశ్​ రాజ్‌పుత్‌ గాయపడ్డారు. ఒక ఎంపీని రాహుల్‌గాంధీ నెట్టారని ఆ ఎంపీ తనపై పడడం తాను కింద పడి గాయపడ్డానని సారంగి చెప్పారు. ముకేష్‌ రాజ్‌పుత్‌ను, తలకి గాయమైన సారంగినీ RML ఆసుపత్రికి తరలించారు.

రాజ్యాంగంపై దాడి జరిగింది : రాహుల్
తనపై అధికార పక్షం చేసిన ఆరోపణలను లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. తాము పార్లమెంటు లోపలికి వెళ్తుంటే బీజేపీ ఎంపీలే తమను అడ్డుకుని నెట్టేశారని, బెదిరించారని రాహుల్ చెప్పారు. మల్లికార్జున ఖర్గేను కూడా తోసివేశారని ఆ సమయంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. '(గాయాల గురించి) నాకు తెలియదు. మీ కెమెరాల్లోనే ఉంది. మేము లోపలికి వెళ్లేందుకు యత్నించాం. బీజేపీ ఎంపీలు మమ్మల్ని ఆపేందుకు ప్రయత్నించి నెట్టివేశారు. మమ్మల్ని బెదిరించారు. ఖర్గేను కూడా నెట్టివేశారు. నెట్టివేసినా మాకు ఇబ్బందిలేదు. అది పార్లమెంటు లోపలికి వెళ్లే ద్వారం. లోపలికి వెళ్లే అధికారం మాకు ఉంది. కానీ బీజేపీ సభ్యులు మమ్మల్ని లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ప్రధానమైన విషయం ఏమిటంటే రాజ్యాంగంపై దాడి జరిగింది. అంబేడ్కర్‌ను అవమానించారు' రాహుల్ గాంధీ అన్నారు.

గాయపడిన ఎంపీలకు ప్రధాని ఫోన్
ఆర్‌ఎంల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎంపీలు ముకేశ్​ రాజ్‌పుత్, ప్రతాప్‌ చంద్ర సారంగిలను ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి పరామర్శించారు. వారి ఆరోగ్యంపై వాకబు చేశారు. RML ఆసుపత్రికి వెళ్లిన కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, శివరాజ్‌ సింగ్ చౌహన్ ఎంపీలు సారంగి, ముకేష్‌లను పరామర్శించారు. గాయపడిన ఎంపీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు డిమాండ్ చేశారు.

ఐసీయూలో చికిత్స
ఎంపీలు సారంగి, ముకేష్‌లకు ICUలో చికిత్స అందిస్తున్నట్లు ఆర్​ఎంఎల్ ఆసుపత్రి డాక్టర్ అజయ్ శుక్ల వివరించారు. ఇద్దరికీ తలపై గాయాలైనట్లు చెప్పారు. ఎంపీ సారంగికి తలపై కుట్లు వేశామన్నారు. సృహకోల్పోయిన స్థితిలో వచ్చిన ఎంపీ ముకేష్ రాజ్‌పుత్ చికిత్స తర్వాత స్పృహలోకి వచ్చారని వివరించారు. ఆయనకి బీపీ ఎక్కువగా ఉందని చెప్పారు. పరీక్షలు చేశామని, లక్షణాల ఆధారంగా చికిత్స కొనసాగుతోందని డాక్టర్ శుక్ల వెల్లడించారు.

పరస్పర ఫిర్యాదులు
పార్లమెంటు ప్రవేశద్వారం వద్ద జరిగిన తోపులాట ఘటనపై అధికార, ప్రతిపక్ష ఎంపీలు పరస్పరం ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తొలుత ఎన్​డీఏ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీలు అనురాగ్‌ ఠాకూర్‌, బన్‌సూరి స్వరాజ్‌ తదితరులు పోలీసులను కలిసి తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ప్రతాప్‌ చంద్ర సారంగి, ముకేశ్‌ రాజ్‌పుత్‌పై రాహుల్‌గాంధీ సారథ్యంలో కాంగ్రెస్‌ సభ్యులు దాడిచేసినట్లు ఆరోపించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ ఎంపీలు కూడా పార్లమెంటు ఆవరణలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎంపీలు తమపై దాడిచేసినట్లు పేర్కొన్నారు. ఎన్​డీఏ ఎంపీల దాడిలో ఖర్గేతోపాటు మరికొందరు గాయపడినట్లు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details