తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 1:36 PM IST

ETV Bharat / bharat

'విద్యా వ్యవస్థను మాఫియాకు అప్పగించారు' - మోదీ ప్రభుత్వంపై ప్రియాంక ఫైర్ - NEET UG Paper leak

Priyanka Gandhi on NEET Paper leak : దేశంలోని ప్రముఖ పరీక్షల దుస్థితికి మోదీ ప్రభుత్వమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. బీజేపీ పాలనలో మొత్తం విద్యా వ్యవస్థను మాఫియా, అవినీతిపరులకు అప్పగించారని ఆరోపించారు.

NEET UG Paper Leak
NEET UG Paper Leak (ANI)

Priyanka Gandhi on NEET Paper leak: నీట్‌ యూజీ సహా జాతీయ పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రధాని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. మొత్తం విద్యా వ్యవస్థను మోదీ ప్రభుత్వం మాఫీయా, అవినీతిపరులకు అప్పగించిందని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. నీట్‌ పీజీ, యూజీసీ నెట్‌, సీఎస్‌ఐఆర్‌ నెట్‌ పరీక్షలు ఇప్పటికే రద్దయ్యాయని, నీట్‌ యూజీ ప్రశ్నపత్రం లీక్‌ అయిందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రియాంక పోస్ట్‌ చేశారు.

'దేశ విద్యా వ్యవస్థ, పిల్లల భవిష్యత్తును అత్యాశపరులకు, మతోన్మాద అసమర్థులకు అప్పజెప్పాలన్న రాజకీయ నేతల దురహంకారం వల్లే పేపర్ లీక్‌లు, పరీక్షల రద్దులు జరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వ పాలనలో క్యాంపస్‌ల నుంచి విద్య మాయమవుతోంది. రాజకీయ గూండాయిజం మన విద్యా వ్యవస్థకు గుర్తింపుగా మారింది. బీజేపీ ప్రభుత్వం ఒక్క పరీక్షను కూడా సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. యువత భవిష్యత్తుకు బీజేపీ అతిపెద్ద అడ్డంకిగా మారింది. దేశంలోని సమర్థులైన యువత తమ విలువైన సమయాన్ని, శక్తిని బీజేపీపై పోరాడేందుకు వృథా చేస్తున్నారు. ప్రధాని మోదీ నిస్సహాయంగా మారి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు' అని ప్రియాంక గాంధీ మండిపడ్డారు.

ప్రతిపక్షాల విమర్శలు
జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన పరీక్షలు వరుసగా వాయిదా పడుతుండడంపై ప్రతిపక్ష నేతలు విమర్శల దాడిని మరింత పెంచారు. రోజూ విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ పాలనలో ఆడుకుంటోందని కాంగ్రెస్ సీనియర్‌ నేత మాణికం ఠాగూర్‌ ఆరోపించారు. 'బీజేపీ పాలనలో రోజూ పేపర్ లీక్ అవుతూ వాయిదా పడుతూనే ఉంది. కానీ, ప్రధాని మోదీ మాత్రం స్పందించడం లేదు. ప్రధానిగా నాయకత్వ లక్షణాలను కోల్పోయారు. కనీసం పని చేయలేని మంత్రులపై మోదీ చర్యలు కూడా తీసుకోలేకపోతున్నరు' ఠాగూర్ మండిపడ్డారు.

సీబీఐ దర్యాప్తుపై సందేహాలు
నీట్‌ పీజీ పరీక్ష వాయిదాను ఒక రోజు ముందు వాయిదా వేయడంపై దిల్లీ మంత్రి ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ తీవ్ర విమర్శలు చేశారు. కొందరు ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారని, ఈ సమయంలో పరీక్షను ఎలా రద్దు చేస్తారని నిలదీశారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయిస్తున్నారని కానీ దీనిపై కూడా సందేహాలు ఉన్నాయని, జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలని ఆప్‌ నేత డిమాండ్‌ చేశారు.

బీజేపీ నిర్లక్ష్యానికి విద్యార్థులు బలి
నీట్​ పీజీ పరీక్ష వాయిదాపై డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ అసమర్థ ప్రభుత్వం వ్యవస్థీకృత గ్యాంగ్‌లకు పేపర్లు లీక్ చేయడానికి అనుమతిస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ నేరపూరిత నిర్లక్ష్యానికి దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని మండిపడ్డారు. పరీక్షల నిర్వహణపై మోదీ ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆర్​జేడీ ఎంపీ మనోజ్ ఝా మండిపడ్డారు. ఎన్‌డీఏ ప్రభుత్వం కూలకపోతే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని మనోజ్‌ ఝా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు.

విద్యార్థుల అవస్థలు
నీట్-పీజీ పరీక్ష వాయిదాపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షను ఉన్న పళంగా రద్దు చేయడం చాలా తప్పని నీట్ పీజీ అభ్యర్థి సునంద పన్సారీ ఆవేదన వ్యక్తం చేశాడు. పరీక్షకు హాజరయ్యేందుకు 600 కి.మీ. ప్రయాణించానని అసలు పరీక్ష మార్చిలో జరగాల్సి ఉందని ఆ తర్వాత జూలైకి వాయిదా పడిందని అన్నాడు. ఇప్పటికే ఓసారి పరీక్షను వాయిదా వేశారని ఇప్పుడు పరీక్షను మళ్లీ వాయిదా వేశారని నీట్‌ పీజీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల ముందు పేపర్ లీక్ గురించి తమకు సమాచారం ఇవ్వలేదని అన్నారు. 12 గంటల ముందు పరీక్షను వాయిదా వేయడంపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని విద్యార్థి ఖర్చులకు రూ. 10,000 తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే నీట్‌ యూజీ పరీక్ష రద్దును కొందరు తప్పుపడుతున్నారు. నీట్‌ యూజీ పరీక్షలో తాను 682 మార్కులు సాధించానని, మళ్లీ పరీక్ష నిర్వహిస్తే తాము నష్టపోతామని అంటున్నారు.

మూడోసారి 'పుష్పక్' ప్రయోగం సక్సెస్- ఇస్రో ఖాతాలో మరో ఘనత

DSP నుంచి కానిస్టేబుల్‌గా డిమోషన్‌- లేడీ పోలీస్​తో వివాహేతర సంబంధమే కారణం! - Uttar Pradesh Police Demotion

ABOUT THE AUTHOR

...view details