Parliament Budget Session 2025 Murmu Speech :పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు.
బడ్జెట్ లో వారికి ప్రాధాన్యం : ముర్ము
ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయని ద్రౌపదీ ముర్ము వ్యాఖ్యానించారు. ఇటీవల రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నామని పేర్కొన్నారు. బడ్జెట్లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యత ఉంటుందని ఆమె వెల్లడించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే మూడు రెట్లు వేగంతో పనిచేస్తోందని కొనియాడారు. త్వరలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
'పేదల కోసం అనేక పథకాలు'
దేశంలో పేదరిక నిర్మూలక కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని ముర్ము తెలిపారు. 25 కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటకు తీసుకొచ్చామని, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు వేగంగా అమలుచేస్తున్నామని వెల్లడించారు. మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. అదనంగా మూడు కోట్ల కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజనను పొడిగించామని స్పష్టం చేశారు.
"ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మంది వృద్ధులకు ఆరోగ్య బీమా అందిస్తున్నాం. అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు ప్రవేశపెడుతున్నాం. కేంద్ర సర్కార్ విద్యా రంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. యువతకు నూతన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. నూతన విద్యా విధానంతో ఆధునిక విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశాం. సంస్కరణలు వేగవంతంగా చేశాం. ఒకే దేశం-ఒకే ఎన్నిక, వక్ఫ్ సవరణ బిల్లు అమలు దిశగా సాగుతున్నాం" అని ముర్ము ప్రసంగించారు.
మహిళా సాధికారిత కోసం కృషి : ముర్ము
అలాగే దేశంలో కార్పొరేట్ సంస్థలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారని ద్రౌపదీ ముర్ము కొనియాడారు. ఒలింపిక్ పతకాలు సాధిస్తూ దేశం గర్వించేలా చేస్తున్నారని ప్రశంసించారు. మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగుని తెలిపారు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద 91లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పిస్తున్నామని, 3 కోట్ల మందిని లక్పతీ దీదీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
"భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా మార్చడమే మా ముందున్న లక్ష్యం. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను మొదలుపెట్టాం. కృత్రిమ మేధ రంగంలో భారత ఏఐ మిషన్‌ను ప్రారంభించాం. భారత్ తన సొంత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌ను ప్రయోగించే రోజు ఎంతో దూరంలో లేదు. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ పథకాలు, ఈ-కామర్స్ ఎగుమతి కేంద్రాలు దేశంలో అన్ని రంగాల్లో వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీలో సమర్థత కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, డీప్‌ఫేక్ వంటివి సామాజిక, ఆర్థిక, దేశ భద్రతకు పెను సవాళ్లుగా ఉద్భవించాయి. ప్రపంచ వేదికపై డిజిటల్ టెక్నాలజీలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. మన యూపీఐ లావాదేవీల వ్యవస్థ విజయాన్ని అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రశంసలు కురిపించాయి" అని ముర్ము ప్రసంగించారు.