- బిహార్‌లో అవినీతి నిర్మూలించాలి.
- బీపీఎస్సీ అభ్యర్థులకే నా మద్దతు.
- విద్యార్థులపై లాఠీఛార్జ్ కరెక్ట్ కాదు.
- అలా జరగకుంటే విద్యార్థుల నాయకత్వం వహిస్తా.
- పోలీసులను కోర్టుకు ఈడుస్తా!
- ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్.
గత రెండు రోజుల్లో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ తీరు ఇది. తన వ్యాఖ్యలు, బీపీసీఎస్ విద్యార్థుల నిరసనలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రశాంత్ కిశోర్ బిహార్ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించారు. ఈ రెండు రోజుల్లో చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి. ఇవన్నీ చూస్తే 2025లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రశాంత్ కిశోర్ సమరశంఖం పూరించారా అనే సందేహం కలుగకమానదు. అందులో భాగంగానే విద్యార్థులను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ ప్రశాంత్ కిషోర్ పెద్ద పొలిటికల్ గ్యాంబుల్కు తెర లేపారా? పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికే ప్రశాంత్ కిశోర్ ప్రయత్నస్తున్నారా? అసలు బిహార్‌లో ఏం జరుగుతోంది? బీపీఎస్పీ పరీక్షలో ఏం జరిగింది? అభ్యర్థులు ఎందుకు నిరసనలు చేస్తున్నారు? వారి డిమాండ్లు ఏంటి? ప్రతిపక్ష ఆర్జేడీ వ్యక్తం చేస్తున్న అనుమానాలు నిజమేనా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బీపీఎస్సీ అభ్యర్థుల నిరసనలకు కారణమేంటి?
డిసెంబర్ 13న బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) కంబైన్డ్ కాంపిటీటివ్ పరీక్షలను నిర్వహించింది. దాదాపు 5 లక్షల మంది అశావహులు 900 ఎగ్జామ్ సెంటర్లలో పరీక్షలు రాశారు. అయితే పరీక్ష ప్రశ్నాపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడం వల్ల గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పరీక్షను రద్దు చేసి కొత్తగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. ఈ అంశంపై బీపీఎస్ పరీక్షల కంట్రోలరు రాజేశ్‌కుమార్ సింగ్ శుక్రవారం వివరణ ఇచ్చారు. పరీక్షలను పారదర్శకంగానే నిర్వహించామని, బీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేసేది లేదన్నారు. ఏప్రిల్‌లో జరగనున్న పరీక్షలపై అభ్యర్థులు దృష్టి పెట్టాలని సూచించారు. దీంతో విద్యార్థులు తమ ఆందోళనలను ఉద్ధృతం చేశారు.
అయితే, పట్నాలోని బాపు పరీక్ష పరిసర్లో(ఓ పరీక్ష కేంద్రం) ఎగ్జామ్ రాసిన 10,000 మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించడానికి బీపీఎస్సీ సిద్ధంగా ఉందని అంతకుముందు ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం. డిసెంబర్ 13న ప్రశ్నాపత్రం లీక్ అయిందని విద్యార్థులు పరీక్షలు బహిష్కరించారు. పరీక్షను రద్దు చేయడానికి కుట్రలో భాగంగానే ఎగ్జామ్ జరుగుతుండగా అంతరాయం కలిగించారని బీపీఎస్సీ స్పందించింది.
పీకే ఎంట్రీ- లాఠీ ఛార్జ్!
ఆందోళలను ఉద్ధృతం చేసిన అభ్యర్థులు బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 13 నుంచి గర్దాని బాగ్ వద్ద నిరసనలు చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న బీపీఎస్సీ అభ్యర్థులకు ప్రతిపక్ష ఆర్జేడీ, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్ 29) నిరసన చేపట్టిన అభ్యర్థులకు మద్దతుగా ప్రశాంత్ కిశోర్ పట్నాలోని గాంధీ మైదాన్ వద్దకు వచ్చారు. అనంతరం అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఇంతలో అనూహ్యంగా నిరసన చేస్తున్న అభ్యర్థులు ముఖ్యమంత్రి నివాసం వైపు ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు నిరసనకారులను అటు వైపు రావద్దని హెచ్చరించారు. అయినా సీఎం నివాసం వైపు ర్యాలీగా కొనసాగింది. ఈ క్రమంలో నిరసన కారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. జల ఫిరంగులు ప్రయోగించారు. ఇది జరగడానికి కొద్ది సేపటి ముందే ప్రశాంత్ కిశోర్ అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. అభ్యర్థులపై లాఠీ ఛార్జ్‌ను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే, లాఠీఛార్జ్‌కు ముందు ప్రశాంత్ నిష్క్రమణ, అభ్యర్థులు గాంధీ మైదానం వైపు వెళ్లడంపై ఆర్జేడీ పలు అనుమానాలు వ్యక్తం చేసింది.
పీకేకు నిరసన సెగ!
లాఠీఛార్జ్ తర్వాత మళ్లీ నిరసనకు దిగిన అభ్యర్థుల వద్దకు ప్రశాంత్ కిశోర్ వెళ్లారు. అయితే పీకే వెళ్లగానే అభ్యర్థులు 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో నిరసనకారులకు, ప్రశాంత్ కిశోర్ మధ్య వాగ్వాదం జరిగింది. 'మా వద్ద దుప్పట్లు తీసుకుని మా ముందే యాటిట్యూడ్ చూపిస్తున్నారా?' అని ప్రశాంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కోపోద్రిక్తులనై అభ్యర్థులు 'లాఠీ ఛార్జ్ జరినప్పుడు ఏమయ్యావ్?' అంటూ నిలదీశారు.
బీజేపీ బీ-టీమ్!
ముఖ్యమంత్రి నివాసం వైపు నిరసనకారులు ర్యాలీగా వెళ్లేలా వారిని తప్పుదోవ పట్టించారని ప్రశాంత్ కిశోర్‌ను ఉద్దేశించి ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ అన్నారు. "అభ్యర్థుల నిరసనల వల్ల ప్రభుత్వానికి వణుకు పుట్టింది. నేను ఇటీవల అభ్యర్థుల వద్దకు వెళ్లి మద్దతిచ్చా. ఈ క్రమంలో కొందరు ప్రభుత్వానికి బీ-టీమ్‌గా వ్యవహరించారు. అధికారుల హెచ్చరికలు ఉన్నప్పటికీ నిరసనకారులు గాంధీ మైదాన్ వైపు ర్యాలీగా వెళ్లేలా తప్పుదోవ పట్టించారు. అభ్యర్థులు లాఠీ ఛార్జ్ ఎదుర్కొనే సమయంలో నాయకత్వం వహించడానికి వచ్చినవారు పారిపోవడం ఎంచుకున్నారు" అని తేజశ్వి ఎద్దేవా చేశారు.
'పొలిటికల్ మైలేజ్ కోసం కాదు'
ఆర్జేడీ ఆరోపణలను ప్రశాంత్ కిశోర్ ఖండించారు. పొలిటికల్ మైలేజీ కోసం విద్యార్థును ఉపయోగించుకోవడం లేదని చెప్పారు. "సాధారణంగా నేను నిరసనలలో పాల్గొనను. విద్యార్థులను కొట్టినప్పుడు మాత్రమే నేను అక్కడికి వెళ్లాను. తప్పు ప్రభుత్వానిదా లేక విద్యార్థులదా అనేది నా సమస్య కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్యార్థులను లాఠీలతో కొట్టకూడదు. నేను అభ్యర్థులకు మద్దతుగా ఉంటానని హామీ ఇచ్చాను. నేను అక్కడ ఉన్నప్పుడు వారిని ఎవరూ ముట్టుకోలేదు. కానీ నేను వెళ్లిన తర్వాత విద్యార్థులను పోలీసులు కొట్టారు. అది చాలా తప్పు. నేను ఇప్పటికీ బిహార్‌లోనే ఉన్నాను. ఒకవేళ విద్యార్థులు గాయాలపాలైతే, బాధ్యులు పర్యవసానాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. వారిపై కేసులు వేస్తాము. సమాధానం చెప్పేలా చేస్తాము" అని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి డెడ్‌లైన్!
"మేము బిహార్ చీఫ్ సెక్రటరీని కలిశాము. మాకోసం సమయం కేటాయించి మమ్మల్ని, విద్యార్థులను కలిసినందుకు ధన్యవాదాలు. కానీ సీఎస్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బహుశా ఆయనకు సీఎం నుంచి క్లియరెన్స్ కావాలేమో. మా డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టి 48 గంటల సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు సీఎం పట్నాలో లేరు. ఈ రాత్రికి తిరిగి వస్తారు. ప్రభుత్వం కావాలంటే 48 గంటల్లో పరిష్కారంతో రావచ్చు. సీఎం ఆహ్వానిస్తే మేము, విద్యార్థులంతా ఆయనను కలుస్తాం. 48 గంటల్లోగా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే, విద్యార్థులు నిరసనకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటు అవుతుంది" అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
ఎన్డీఏతో పొత్తు- అందుకేనా ఇదంతా?
ఇదిలా ఉండగా, ఈసారి ఎన్డీఏ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, అందులో ఎలాంటి అనుమానాలు లేవని ఇటీవల బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్, ఆర్జేడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీకి ప్రశాంత్ కిశోర్ బీ-టీమ్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్ ఎన్డీఏలో కలుస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.