Prashant Kishor On BJP JDU Alliance :జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ బిహార్‌లోని మహాకూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జట్టు కట్టడంపై ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఏర్పడిన బీజేపీ- జేడీయూ కూటమి కూడా ఎక్కువ కాలం నిలవదని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత ఈ కూటమి విడిపోవచ్చని చెప్పారు. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ బెగూసరాయ్‌లో మీడియాతో మాట్లాడారు.
మీడియాతో మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ 2025లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా బీజేపీ-జేడీయూ కూటమి స్థిరంగా ఉండదని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. అంతకుముందే ఆ పొత్తుకు తెరపడుతందని అన్నారు. నీతీశ్‌కు తలుపులు మూతపడ్డాయని గతేడాది చెప్పిన బీజేపీ, పొత్తు పెట్టుకున్నందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉందని విమర్శించారు. "గత ఏడాదిగా నేను చేసిన వ్యాఖ్యలను మీరు వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తోంది. నీతీశ్ కుమార్ ఎప్పుడైనా కూటమి మారవచ్చని చెప్పిన ఏకైక వ్యక్తిని నేను మాత్రమే. నీతీశ్ ఒక 'పాల్తురామ్' అని ప్రజలకు ఇప్పటికే తెలుసు" అని తెలిపారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ ఎత్తుగడలు వేసినట్లు కనిపిస్తోందని చెప్పారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ హయాంలో కాంగ్రెస్ చేసిన పనినే ఇప్పుడు బీజేపీ చేస్తోందని విమర్శించారు. రెండు జాతీయ పార్టీలు స్వల్పపాటి లాభాల కోసం పెద్దగా ప్రజాదరణ లేని ప్రాంతీయ నేతలతో పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. ఈ "రివాల్వింగ్ డోర్ రాజకీయాలకు" ముగింపు పలకడానికి 'జన్ సురాజ్' ప్రచారం కట్టుబడి ఉందని కిషోర్ పేర్కొన్నారు.
'జేడీయూ 2024లోనే ఖతం'
బిహార్ సీఎం నీతీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ 2024లోనే ఖతం అవుతుందని ఆర్జేడీ అగ్రనేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో బిహార్‌లో మరిన్ని రాజకీయ పరిణామాలు జరుగుతాయని తెలిపారు. ఇప్పుడే ఆట మొదలైందంటూ సవాల్ విసిరారు. ఇంకా ఆట ఆడాల్సి ఉందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అయితే నీతీశ్‌కుమార్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. జేడీయూను తమ కూటమిలో చేర్చుకున్నందుకు బీజేపీకి కృతజ్ఞతలని తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు.
"మహాకూటమి ప్రభుత్వం పతనమైనందుకు మాకు కోపం గానీ నిరాశ గానీ లేదు. ఎంతో సంయమనంతో పొత్తుధర్మాన్ని పాటించాం. ఆ ప్రకారంగానే ఇకముందు ప్రజలకు మా వాణి వినిపిస్తాం. ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నా. ఇప్పుడే ఆట మొదలైంది. ఇంకా ఆట ఆడాల్సి ఉంది. నేను ఏదైతే చెబుతానో...అది చేసి చూపిస్తాను. మీరు రాసుకోండి. 2024లోనే జేడీయూ పార్టీ ఖతం అవుతుంది" అంటూ తేజస్వీ యాదవ్ వ్యాఖ్యలు చేశారు. బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌కు ఊసరవెల్లి రత్న అవార్డుతో సత్కరించాలని ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ ఎద్దేవా చేశారు.