Prashant Kishor Party Launch: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ పార్టీని ప్రారంభించారు. బిహార్ పట్నాలోని వెటర్నరీ కాలేజీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆయన తన పార్టీ జన్ సురాజ్‌ను అధికారికంగా ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రసాద్ యాదవ్, మాజీ దౌత్యవేత్త పవన్ వర్మ, మాజీ ఎంపీ హస్సన్ సమక్షంలో ప్రారంభించిన ప్రశాంత్, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి మనోజ్ భారతిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. విద్య, ఉపాధి అవకాశాల ప్రాధాన్యాల గురించి బిహారీలకు వివరించి ఓట్లు అడుగుతామని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.
'ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థగా మారుస్తా'
జన్ సురాజ్ పార్టీ అధికారంలోకి వస్తే బిహార్‌లో మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తామని పీకే ప్రకటించారు. బిహార్‌ను ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రానున్న పదేళ్లల్లో రూ.5 లక్షల కోట్లు అవసరమని చెప్పారు. ఈ మద్యపాన నిషేధం ఎత్తివేయడం ద్వారా వచ్చిన సొమ్మును బడ్జెట్‌కు, నేతల భద్రత, రోడ్లు, నీళ్లు, విద్యుత్‌కు మళ్లించమని తెలిపారు. బిహార్ విద్యా వ్యవస్థ నిర్మాణానికి మాత్రమే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. మద్యపాన నిషేధం వల్ల ఏటా రూ.20 వేల కోట్ల ఖజానాకు నష్టం వాటిల్లుతోందని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే గంటలో మద్యపానంపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తామని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ప్రత్యేక హోదాపై నినాదాలు సరిపోవని జేడీయూను ఉద్దేశించి అన్నారు.