Prasant Kishore On BJP Seats : లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఇంచుమించు గతసారి ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. బీజేపీ మీద దేశంలో పెద్దగా కోపం గానీ సవాల్ విసిరే వ్యక్తులు గానీ లేరని, ఆ పార్టీని మోదీ మరోసారి విజయతీరాలకు చేరుస్తారని వివరించారు. 2019లో బీజేపీకి 303 సీట్లు వచ్చినట్లే ఈసారీ అటూఇటుగా, లేదా కాస్త ఎక్కువే వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. హామీలు నెరవేర్చని కారణంగా మోదీపై ప్రజలకు కొంత నిరాశ ఉండొచ్చు కానీ.. కోపంగా అయితే లేరని పేర్కొన్నారు.
కాంగ్రెస్ మద్దతుదారుల్లో తప్ప!
రాహుల్ గాంధీ వస్తే పరిస్థితి ఇంకొంత మెరుగవుతుందన్న భావన ఆయన మద్దతుదారుల నుంచి మాత్రమే కనిపిస్తోందని, అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించలేదని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. 325 లోక్‌సభ స్థానాలు ఉండే ఉత్తర, పశ్చిమ భారతం 2014 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉందన్నారు. 225 నియోజకవర్గాలు ఉన్న తూర్పు, దక్షిణ భారతంలో బీజేపీకి ప్రస్తుతం 50 కంటే తక్కువ సీట్లున్నాయని వివరించారు. అయితే ఈసారి దక్షిణాదిలో బీజేపీ కాస్త మెరుగయ్యే అవకాశం ఉందన్నారు. బీజేపీకి నష్టం అంటూ వస్తే అది ఉత్తర, పశ్చిమ భారత్‌లోనే జరుగుతుందని చెప్పారు.
ఆ చర్చ ఎక్కడా లేదు!
బీజేపీ ఓడిపోతుందా లేదా విజయం సాధిస్తుందా అన్న చర్చ ఎక్కడా లేదని ప్రశాంత్ కిషోర్ వివరించారు. కేవలం బీజేపీ 370 సీట్లు సాధిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అయిందని పేర్కొన్నారు. చర్చ కేంద్రకాన్ని చార్ సౌ పార్ నినాదంతో మోదీ మార్చివేశారన్న ప్రశాంత్ కిషోర్, ఇందుకు మోదీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే అని వ్యాఖ్యానించారు.