Political Parties On Kejriwal Arrest :దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను కాంగ్రెస్, డీఎంకే సహా పలు విపక్షాలు ఖండించాయి. పలు రాష్ట్రాల్లో ఆప్ ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విపక్షాలను ఎదుర్కొనేందుకు కేంద్రం ఈడీని ప్రయోగిస్తోందని మండిపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇలాంటి చర్యలకు దిగడమంటే రాజకీయ కక్షసాధింపు చేయడం ద్వారా విపక్షాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమేనని నేతలు విమర్శిస్తున్నారు.
'ఇండియా కూటమి తగిన సమాధానం చెబుతుంది'
"ఓ భయపడ్డ నియంత ప్రజాస్వామ్యాన్ని చంపేయాలనుకుంటున్నాడు. మీడియాతో సహా అన్ని సంస్థలను బంధించి, పార్టీలను విచ్ఛిన్నం చేస్తూ, కంపెనీల నుంచి డబ్బు వసూలు చేస్తూ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాను స్తంభింపజేస్తూ ప్రవరిస్తున్నారు. పైశాచికత్వం సరిపోలేదు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారు. దీనికి ఇండియా కూటమి తగిన సమాధానం చెబుతుంది" అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ట్వీట్ చేశారు.
'నీచమైన స్థితికి దిగజారిన బీజేపీ'
కేజ్రీవాల్ అరెస్ట్‌ను తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా ఖండించారు. "2024 ఎన్నికలకు ముందు దశాబ్దాల వైఫల్యాలు, ఓటమి భయంతో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం ద్వారా బీజేపీ ప్రభుత్వం నీచమైన స్థితి దిగజారింది" అని స్టాలిన్ ట్వీట్ చేశారు. తమకు వ్యతిరేకంగా ఎవరూ గళం విప్పొద్దనేది బీజేపీ విధానమని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. వ్యతిరేక గళం విప్పితే దర్యాప్తు సంస్థలను ఎదుర్కోవాల్సిందేనని వ్యాఖ్యలు చేసింది.
'ఇండియా' కూటమి ఐక్యంగా ఉంది!
"ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల వేళ సీఎం కేజ్రీవాల్ అరెస్టు బిజెపి అధికారం కోసం ఎంత దిగజారుతుందో తెలియజేస్తుంది. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్యకు వ్యతిరేకంగా 'ఇండియా' కూటమి ఐక్యంగా ఉంది" అని ఎన్సీపీ- ఎస్సీపీ శరద్ పవార్ ట్వీట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండించింది.
కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సిందే!
మరోవైపు, అరవింద్ కేజ్రీవాల్‌ను వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి అరెస్టు కావడం పట్ల దిల్లీ పౌరులు సంతృప్తి చెందారని ఆరోపించింది. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని జైలు నుంచి నడిపిస్తారంటూ ఆప్ నేతలు చేసిన ప్రకటనలు రాజ్యాంగ నిబంధనలను అవమానించడమేనని తెలిపింది. దిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ ఇంట్లో శుక్రవారం సాయంత్రం సోదాలు జరిపిన ఈడీ అధికారులు ఆయన్ను విచారించిన తర్వాత అరెస్టు చేశారు.