Kolkata Doctor Case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, హడావుడిగా తమ కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారని తెలిపారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని ఆరోపించారు.
వైద్యురాలిపై హత్యాచార ఘటనకు బుధవారం రాత్రి కోల్‌కతాలో జరిగిన ఆందోళనల్లో బాధితురాలి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆ సమయంలో పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. "పోలీసులు మొదటి నుంచి మా కుమార్తె హత్యాచార కేసును మూసివేయడానికి ప్రయత్నిస్తున్నారు. తొలుత మా కుమార్తె మృతదేహాన్ని చూసేందుకు అనుమతించలేదు. పోస్టుమార్టం పరీక్షలు పూర్తయ్యేంతవరకు పోలీస్ స్టేషన్లోనే వేచి ఉండేలా చేశారు. మా కుమార్తె మృతదేహాన్ని మాకు అప్పగించినప్పుడు సీనియర్ పోలీసు అధికారి ఒకరు లంచం ఇవ్వజూపారు. మేము అందుకు తిరస్కరించాం. మా కుమార్తెకు న్యాయం చేయాలని పోరాడుతున్న జూనియర్ వైద్యులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నాం" అని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు.
ఈ కేసుపై తొలుత కోల్‌కతా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, దర్యాప్తు సమయంలో వారు వ్యవహరించిన తీరుపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం దీనిపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడు సంజయ్‌రాయ్ సహా ఘటన జరిగిన ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, మరికొందరికి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు.