Watchman Murder In Bihar: బిహార్‌లోని గోపాల్ గంజ్‌లో వాచ్‌మెన్ హత్య కలకలం రేపింది. పెళ్లికి వెళ్లి వస్తుండగా వాచ్‌మెన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి అతడి రక్తాన్ని కాళీమాతకు సమర్పించారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో స్థానికుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
అసలేం జరిగిందంటే?
బైకుంఠపుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన వివాహ వేడుకకు వెళ్లి వస్తున్న వాచ్‌మెన్ జమీంద్ర రాయ్‌ను సోమవారం అర్థరాత్రి దుండగులు కత్తితో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సోన్ వాలియా డ్యామ్‌కు 50 గజాల దూరంలో ఉన్న పొలంలో వాచ్‌మెన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఆధారాల కోసం గాలిస్తుండగా, డ్యామ్‌కు అవతలివైపు ఉన్న కాళీమాత ఆలయంలో రక్తం కనిపించింది. దీంతో హత్యానంతరం కాళీమాత ఆలయంలో వాచ్‌మెన్ రక్తాన్ని దుండగులు అర్పించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే మృతుడు జమీంద్ర రాయ్ బైకుంత్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంగ్రా గ్రామాస్థుడని పోలీసులు తెలిపారు.
అర్ధరాత్రి దాటినా ఇంటికి రాకపోవడం వల్లే!
సోమవారం సాయంత్రం పెళ్లికి వెళ్లిన జమీంద్రా రాయ్ అర్ధరాత్రైనా ఇంటికి రాకపోవడం వల్ల అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. జమీంద్ర కోసం వెతకడం ప్రారంభించారు. అంతలో డ్యామ్‌కు 50 గజాల దూరంలోని పొలంలో జమీంద్ర మృతదేహం లభ్యమైందని వారికి తెలిసింది. దీంతో జమీంద్ర కుటుంబ సభ్యులు సహా సమీప గ్రామస్థులు అక్కడికి భారీగా చేరుకున్నారు.
"గమ్హారియా సోన్వాలియా గ్రామానికి సమీపంలో ఉన్న ఆనకట్టకు 50 గజాల దూరంలో జమీంద్ర డెడ్ బాడీ కనిపించింది. అలాగే ఆనకట్టకు అవతలివైపు ఉన్న కాళీ ఆలయంలో రక్తం కనిపించింది. దీంతో హత్యానంతరం కాళీ ఆలయంలో రక్తాన్ని ప్రసాదించారేమోనన్న అనుమానం ఉంది. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి నా సోదరుడు ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లాడు. మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. మద్యం మాఫియాకు బలైపోయాడు."
- మృతుడి సోదరుడు
పోలీసుల ముమ్మర దర్యాప్తు
వాచ్‌మెన్ హత్య గురించి తెలియగానే ఎస్పీ అవధేశ్ దీక్షిత్ తన బృందంతో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. "బైకుంత్ పుర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన వాచ్‌మెన్ జమీంద్ర రాయ్ ఓ వివాహ వేడుకకు హాజరై ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో సోన్వాలియా గ్రామ సమీపంలో దుండగులు అతడిని కత్తితో పొడిచి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని ఆనకట్ట సమీపంలో విసిరేశారు. ఆలయంలో రక్తానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ బృందం పలు చోట్ల ఆధారాలు సేకరిస్తోంది. కేసును త్వరగా ఛేదించేందుకు ప్రయత్నిస్తాం" అని ఎస్పీ అవధేశ్ దీక్షిత్ తెలిపారు.