PM Surya Ghar Yojana :సౌర విద్యుత్‌ను అందరికీ చేరువ చేసి, సుస్థిర ప్రగతి సాధించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం 'పీఎం సూర్య ఘర్ : ముఫ్త్ బిజలీ యోజన'ను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోటి గృహాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా రూ.75 వేల కోట్ల పెట్టుబడితో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందగలుగుతారని తెలిపారు.
అంతేకాకుండా మరింత ఆదాయం, తక్కువ విద్యుత్ బిల్లులు, ఉపాధి కల్పనకు ఈ పథకం దారితీస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకుని వినియోగదారులు, ముఖ్యంగా యువకులు 'పీఎం సూర్య ఘర్ : ముఫ్త్ బిజలీ యోజన'ను బలోపేతం చేయాలని ప్రధాని కోరారు. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే తదితర ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్థానిక సంస్థలకు ప్రోత్సాహకాలు
ఈ పథకాన్ని ప్రధాని మోదీ అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ సమయంలో తొలిసారి ప్రకటించారు. అనంతరం కేంద్ర బడ్జెట్లోనూ దీని గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. తాజాగా దీన్ని పీఎం 'సూర్య ఘర్'గా పిలవనున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ పథకానికి క్షేత్ర స్థాయిలో ప్రాచుర్యం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తమ పరిధిలోని వినియోగదారులు సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించేందుకు పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలకు కేంద్రం ప్రోత్సాహకాలు అందించనుంది.
'పీఎమ్ సూర్యఘర్' పథకం ప్రయోజనాలివే
- సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకున్న వారికి ఏటా రూ.15-18 వేలు ఆదా అవుతాయి.
- ఈ సోలార్ రూఫ్‌టాప్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌లో ఇంటి అవసరాలకు పోనూ, మిగతా కరెంట్‌ను డిస్కంలకు అమ్ముకోవచ్చు.
- ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
- ఈ పథకం ద్వారా సౌర ఫలకాలు సరఫరా చేసే చాలా పరిశ్రమలకు సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసే అవకాశాలు లభిస్తాయి.
- సోలార్ పరికరాల తయారీ, నిర్వహణ, సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసే సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.