Independence Day 2024 Modi :78వ స్వాతంత్ర్య వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దిల్లీలోని ఎర్రకోటలో గురువారం జరిగే ఈ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి వేడుకలు జరగనున్నాయి. మోదీ 11వ సారి త్రివర్ణ పతకాన్ని ఎగురవేయనున్నారు. ఈ ఏడాది వేడుకలకు దాదాపు ఆరు వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. వీరిలో రైతులు, యువత, మహిళలు, గిరిజన సంఘాల నాయకులు సహా అనేక మందికి ఆహ్వానం పంపారు.
ఆ లక్ష్యంతో 6 వేల మందికి ఆహ్వానం
జాతీయ ఉత్సవాల్లో ప్రజా భాగస్వామాన్ని పెంచాలనే లక్ష్యంతో 6 వేల మందికి ఆహ్వానం పంపినట్లు కేంద్రం తెలిపింది. 2047 వికసిత్ థీమ్‌తో ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలు జరగనున్నాయి. భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ వేడుకలు పునరుత్తేజాన్ని అందిస్తాయని తెలిపింది. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మొత్తం 117 మంది అథ్లెట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించారు.