తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యుద్ధనౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ- దేశ చరిత్రలో ఇదే తొలిసారి! - PM MODI MUMBAI VISIT

రెండు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామని జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోదీ- సైన్యం అమ్ములపొదిలోకి ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీల్‌గిరి, ఐఎన్ఎస్ వాఘ్​షీర్

PM Modi Commissions 3 Warships
PM Modi Commissions 3 Warships (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2025, 12:04 PM IST

PM Modi Commissions3 Warships : ప్రధాన నౌకాదళ శక్తిగా భారత్ అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచదేశాలు భారత్‌ను విశ్వసనీయ, బాధ్యతాయుత భాగస్వామిగా చూస్తున్నాయన్నారు. 77వ సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం ముంబయిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అంతకంటే ముందు రెండు యుద్ధనౌకలను ఐఎన్‌ఎస్‌ సూరత్, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్​ఎస్​ వాఘ్​షీర్​ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.

"ఈ మూడు కూడా మేడిన్ ఇండియానే. వీటిలో ఒకటి డెస్ట్రాయర్, మరొకటి ఫ్రిగేట్, ఇంకోటి సబ్ మెరైన్. ఇవన్నీ కలిపి ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారి. ఇప్పుడు నౌకాదళ శక్తిపరంగా భారత్ మరింత బలోపేతమైంది. భారత్ సైనిక శక్తిని పెంచుకుంటున్నది వికాసం కోసమే. విస్తరణవాదం కోసం కాదు. సురక్షితమైన, వికాసశీలమైన ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని భారత్ సదా కోరుకుంటుంది. ప్రపంచ భద్రత, ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కీలక పాత్ర పోషించనుంది. భారత నౌకాదళం ప్రపంచ దేశాలతో కలిసి సముద్ర జలాల మీదుగా ఆయుధాలు, డ్రగ్స్ రవాణా జరగకుండా, టెర్రరిజానికి ఊతం లభించకుండా అడ్డుకుంటోంది. నౌకాదళం అహర్నిశలు చేస్తున్న సేవల వల్లే భారత్‌ సురక్షిత స్థానంగా మారింది"
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

గత పదేళ్లలో దేశ సైన్యానికి 33 యుద్ధ నౌకలు, 7 జలాంతర్గాములను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. 'రక్షణ రంగంలో భారత్ ఆత్మ నిర్భరతను సాధిస్తోంది. దేశంలో జరిగిన రక్షణరంగ ఉత్పత్తుల విలువ రూ.1.25 లక్షల కోట్లు దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ అడుగులు వేస్తోంది' అని మోదీ తెలిపారు.

'నౌకాదళం మరింత బలోపేతం'
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఐఎన్ఎస్ సూరత్‌ యుద్ధ నౌకలో ప్రాజెక్ట్ 15ఏ, ప్రాజెక్ట్ 15బీ డెస్ట్రాయర్లు ఉన్నాయని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి వెల్లడించారు. ఐఎన్ఎస్ నీల్‌గిరి యుద్ధనౌకలో ప్రాజెక్ట్ 17ఏ ఫ్రిగేట్లు ఉన్నాయని, వీటిని కలిగిన తొలి భారత యుద్దనౌక ఇదేనని చెప్పారు. ఐఎన్ఎస్ వాఘ్​షీర్ యుద్ధనౌకలో ప్రాజెక్ట్ 75 జలాంతర్గాములు (సబ్ మెరైన్లు) ఉన్నాయన్నారు. ఈ మూడు యుద్ధ నౌకల చేరికతో భారత నౌకాదళం సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని దినేశ్ కె.త్రిపాఠి పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలో భారతదేశ ప్రయోజనాలను కాపాడే క్రమంలో నౌకాదళం చేపట్టే ఆపరేషన్లకు ఈ యుద్ధ నౌకలు దోహదం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మూడు యుద్ధనౌకల విశేషాలివే
ఐఎన్‌ఎస్‌ సూరత్‌ : పీ15బీ గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ ప్రాజెక్ట్‌ కింద అభివృద్ధి చేసిన నాలుగో యుద్ధనౌక ఇది. ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డెస్ట్రాయర్‌ యుద్ధ నౌకల్లో ఇదొకటి. ఇందులో వాడిన టెక్నాలజీలో 75 శాతం మన దేశానిదే. ఈ యుద్ధ నౌకలో అధునాతన ఆయుధ సెన్సార్ వ్యవస్థలు ఉన్నాయి. నెట్‌వర్క్‌ సెంట్రిక్‌ సామర్థ్యం దీని సొంతం.

ఐఎన్‌ఎస్‌ నీలగిరి : పీ17ఏ స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన తొలి యుద్ధనౌక ఇది. శత్రువును ఏమార్చే స్టెల్త్‌ పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు.

ఐఎన్‌ఎస్‌ వాఘ్​షీర్: పీ75 ప్రాజెక్టులో భాగంగా రూపొందిస్తున్న ఆరో, చివరి జలాంతర్గామి ఇది. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్‌ గ్రూప్‌ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు.

ABOUT THE AUTHOR

...view details