PM Modi Pariksha Pe Charcha :ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండి పరీక్షలకు సిద్ధం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆరోగ‌్యంగా ఉన్నప్పుడే చదువుపై సరిగా దృష్టి పెట్టగలుగుతారని చెప్పారు. సోమవారం దిల్లీలోని సుందర్ నర్సరీలో ప్రధాని మోదీ "పరీక్షా పే చర్చ" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు- సవాళ్లను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సలహాలు ఇచ్చారు. అలాగే పరీక్షలపై విద్యార్థుల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
'ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలి- ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై దృష్టి' - PM MODI PARIKSHA PE CHARCHA
'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో పాల్గొన్న మోదీ- పరీక్షల వేళ ఒత్తిడిని తట్టుకోవడంపై విద్యార్థులకు ప్రధాని సూచనలు
Published : Feb 10, 2025, 1:11 PM IST
"అనారోగ్యకర ఆహారాలు నీరసింపజేస్తాయి. దినచర్య, అధ్యయన సమయం రూపొందించుకోవాలి. విద్యార్థులు విశ్రాంతికి తగిన సమయం కేటాయించాలి. నిద్ర, పోషకాహారం చాలా ముఖ్యం. అందరూ సూర్యోదయాన్ని ఆస్వాదించాలి. అస్వస్థతకు గురికాలేదంటే ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలి. నిద్ర పూర్తిగా పడుతుందా లేదా? అది కూడా పోషణపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది పరీక్షల సమయంలోనే నిద్ర బాగా వస్తుందని అంటారు. పోషణలో శరీర ఆరోగ్యం, ఫిట్‌నెస్ సాధించడంలో నిద్ర పాత్ర చాలా ఎక్కువ. ఇప్పుడు వైద్యశాస్త్రంలో దానిపై దృష్టి కేంద్రీకరించారు. ఒక రోగి వస్తే నిద్ర ఎలా ఉంది? ఎన్ని గంటలు పడుకుంటారు? వంటి అంశాలను అధ్యయనం చేస్తున్నారు. ఉదయాన్నే ఎండలో నిలబడడం అందరికీ అవసరం. శరీరంపై వీలైనంత ఎక్కువగా సూర్య కిరణాలు నేరుగా పడేలా రెండు నిమిషాలు, ఐదు నిమిషాలు, ఏడు నిమిషాలు ఎంత వీలైతే అంతగా పడేలా చూసుకోవాలి. మేము బడికి వెళ్లేటపుడు పడుతుంటాయి కాదా అంటారేమో- అలా కాదు."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఒత్తిడి ఉన్నా పట్టించుకోవద్దు
ఎలాంటి ఒత్తిడి ఉన్నా పట్టించుకోకుండా స్వతహాగా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు మోదీ. క్రికెట్‌లో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ బ్యాటర్ బాల్‌పై మాత్రమే దృష్టిపెట్టి సిక్స్, ఫోర్ ఎలా కొడతాడో అలాగే విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి చదువుపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. విద్యార్థులకు కుటుంబమే విశ్వవిద్యాలయం వంటిదని అన్నారు. అందరికీ 24 గంటల సమయమే ఉంటుందన్న ఆయన ఉన్న సమయాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో ప్రణాళిక రచించుకోవాలని సూచించారు. విద్యార్థులు ఎల్లప్పుడూ వర్తమానంపై దృష్టిపెట్టి ఏకాగ్రతతో చదువుకోవాలని కోరారు.