PM Modi Speech Ayodhya :అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 తేదీ సరికొత్త యుగానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇకపై రాముడు టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని, మందిరంలో ఉంటారని పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠతో రామ భక్తులంతా చాలా ఆనందంతో ఉన్నారని మోదీ తెలిపారు. అయోధ్యలో ఆలయ నిర్మాణం ఆలస్యమైనందుకు రాముడికి క్షమాపణలు చెబుతున్నానని మోదీ అన్నారు.
"ఇవాళ మన రాముడు మళ్లీ వచ్చాడు. ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు వచ్చాడు. ఈ శుభ గడియల్లో ప్రజలందరీకీ కృతజ్ఞతలు. మన బాలరాముడు ఇకనుంచి టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదు. మన రామ్ లల్లా ఇకనుంచి మందిరంలో ఉంటాడు. రామ భక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారు. దేశ విదేశాల్లో ఉన్న భక్తులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2024 జనవరి 22 ఇది సాధారణ తేదీ కాదు. కొత్త కాలచక్రానికి ప్రతీక. బానిస మనస్తత్వం వదిలి సగర్వంగా తలెత్తుకుని చూస్తున్నారు. మా ప్రయత్నంలో ఏదో లోపం ఉండి ఉంటుంది. అందుకే ఈ పని (ఆలయ నిర్మాణం) పూర్తి చేయడానికి ఇన్నేళ్లు పట్టింది. ఈరోజు శ్రీరాముడు మనల్ని క్షమిస్తాడని ఆశిస్తున్నా."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'వారు సమాజాన్ని అర్థం చేసుకోలేకపోయారు'
గతంలో రాముడి ఉనికిపైనే ప్రశ్నలు లేవనెత్తారని మోదీ గుర్తు చేశారు. వారు భారత సమాజాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారని పేర్కొన్నారు. దశాబ్దాల పాటు కొనసాగిన అయోధ్య వివాదాన్ని పరిష్కరించినందుకు న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు మోదీ. చట్టప్రకారం ఆలయ నిర్మాణం జరిగిందని చెప్పారు. 'రామ మందిరాన్ని నిర్మిస్తే వివాదం చెలరేగుతుందని కొందరు చెప్పేవారు. కానీ వారు ఒకటి అర్థం చేసుకోవాలి. రాముడంటే శక్తి, నిప్పు కాదు. ఆయన సమస్య కాదు పరిష్కారం' అని మోదీ పేర్కొన్నారు.
"మనదేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలం. రాముడి ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యం. ఈ క్షణం దేశప్రజల సహనం, పరిపక్వతకు నిదర్శనం. ఈ క్షణం మన విజయానికే కాదు, వినయానికి కూడా సూచిక. పవిత్రత, శాంతి, సామరస్యం భారత ఆత్మకు ప్రతిరూపం. వసుధైక కుటుంబం అనేది మన జీవన విధానం. ఇది సాధారణ మందిరం కాదు- దేశ చైతన్యానికి ప్రతీక. రాముడు మనదేశ ఆత్మ, ధైర్యసాహసాలకు ఆయన ప్రతిరూపం."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'వెయ్యేళ్ల లక్ష్యం'
రామాలయ నిర్మాణంతోనే మన పని పూర్తి కాలేదన్న మోదీ- వచ్చే వెయ్యేళ్ల కోసం దేశానికి బలమైన పునాది నిర్మించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఘనమైన, దైవిక, సామర్థ్యం కలిగిన భారతదేశాన్ని నిర్మించుకునేందుకు అంతా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో పూర్తిగా సానుకూల శక్తి ఉందని పేర్కొన్న మోదీ- సంప్రదాయాలతో కూడిన ఆధునికతతో దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.
"ఇది విగ్రహ ప్రాణప్రతిష్ఠే కాదు. దేశ విశ్వాసాలకు ప్రాణప్రతిష్ఠ. ఇది కేవలం ఆలయమే కాదు భారత చైతన్యానికి ప్రతీక. రాముడే భారత్ ఆధారం, రాముడే భారత్ విధానం, రాముడే భారత్ ప్రతాపం, రాముడే భారత్ ప్రభావం, రాముడే విశ్వం, రాముడే విశ్వాత్మ. రాముడే నిత్యం, రాముడే నిరంతరం.