PM Modi Rajyasabha Speech :దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయడానికి తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన ప్రధాని మరోసారి విపక్షాలపై మండిపడ్డారు. విపక్షాల అజెండాను ప్రజలు తిరస్కరించారని మోదీ అన్నారు.
తమ దృష్టి అభివృద్ధిపైనేకాని ఓటు బ్యాంకు రాజకీయాలపై కాదన్నారు. రాజ్యాంగం అనే పదం కాంగ్రెస్‌కు సరిపోదన్న ప్రధాని ఎమర్జెన్సీ సమయంలో ఆ పార్టీ చేసిన రాజ్యాంగ సవరణలను గుర్తు చేశారు. రాజ్యాంగ ప్రతులను ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్ తాము చేసిన చెడుపనులను దాచేందుకు యత్నిస్తోందని విమర్శించారు.
విపక్షాల హయాంలో రిమోట్ కంట్రోల్ పాలన నడిచేదంటూ సోనియా గాంధీని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పనితీరును చూసే ప్రజలు మూడోసారి అధికారం ఇచ్చారని తెలిపారు. 140 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ప్రధాని విమర్శించారు.
"స్వతంత్ర భారత చరిత్రలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణంలో అనేక దశాబ్దాల తర్వాత దేశ ప్రజలు ఒక ప్రభుత్వానికి వరుసగా మూడోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారు. పదేళ్లు దేశాన్ని పాలించిన తర్వాత ఒక ప్రభుత్వం తిరిగి ఎన్నికకావడం 60 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 6 దశాబ్దాల తర్వాత జరిగిన ఈ ఘటన అసామాన్యమైనది. కొందరు ఉద్దేశపూర్వకంగా దేశ ప్రజలు తీసుకున్న ఈ మహత్తర నిర్ణయంపై మసిపూయాలని చూస్తున్నారు." అని మోదీ అన్నారు.
వారికి పూర్తి స్వేచ్ఛ
అవినీతిని అణచివేసేందుకు ప్రభుత్వ సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు ప్రధాని మోదీ చెప్పారు. అవినీతి, నల్లధనంపై మరింత ఉక్కుపాదం మోపుతామన్న మోదీ తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరన్నారు.
"అవినీతికి వ్యతిరేకంగా పోరాటమనేది నాకు ఎన్నికల గెలుపు, ఓటములకు కొలమానం కాదు. ఎన్నికల్లో గెలవడానికి లేదా ఓడిపోవడానికి నేను అవినీతిపై పోరాడటం లేదు. ఇది నా మిషన్, ఇది నా దృఢవిశ్వాసం. అవినీతి అనేది ఒక చెదపురుగు దేశాన్ని నాశనం చేసిందని నేను నమ్ముతున్నాను. ఈ దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయడానికి, సామాన్య ప్రజల మనస్సులలో అవినీతిపై ద్వేషాన్ని పెంచడానికి నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను." అని మోదీ స్పష్టం చేశారు.