PM Modi Podcast Debut Nikhil Kamath : ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తోన్న పాడ్‌కాస్ట్‌లో అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కామత్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన ట్రైలర్ వీడియోను నిఖిల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీన్ని మోదీ రీపోస్ట్ చేశారు. అందులో ప్రధాని మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను వీరు గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో తానూ ఒక మనిషినేనని, పొరపాట్లు జరుగుతాయని మోదీ చెప్పారు.
దాదాపు రెండు నిమిషాలు ఉన్న ఈవీడియోలో రాజకీయాలు, వ్యవస్థాపకత, నాయకత్వ సవాళ్లు వంటి పలు అంశాలపై ఇద్దరూ చర్చించారు. పాడ్‌కాస్ట్ ప్రారంభంలో నిఖిల్ కామత్ మాట్లాడారు. 'ప్రధానిని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఒకింత భయంగా ఉంది' అని అన్నారు. దీనికి మోదీ బదులిస్తూ 'ఇదే నా ఫస్ట్ పాడ్‌కాస్ట్. దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియదు మరి' అనడం వల్ల నవ్వులు పూశాయి.