PM Modi On Railways :రైల్వే ట్రాకులపైనే తాను జీవితం ప్రారంభించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అందుకే ఇంతముందుకు మన రైల్వేలు ఎంత అధ్వాన్నంగా ఉండేవో తనకు తెలుసని అన్నారు. 2024లో కేవలం రెండు నెలల్లోనే రూ.11లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించామని చెప్పారు. గత 10 ఏళ్లలో రైల్వేల అభివృద్ధికి గతంలో చేసిన దానికంటే ఆరు రెట్లు ఎక్కువ మొత్తాన్ని బీజేపీ ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు.
10 సంవత్సరాల పని కేవలం ట్రైలర్ మాత్రమే!
భారత్‌ను యువకుల దేశంగా అభివర్ణించిన ప్రధాని- అత్యంత ఎక్కువ యువశక్తి భారత్‌లో ఉందని చెప్పారు. తాము వేసే పునాదులు యువత దివ్యమైన భవిష్యత్‌కు గ్యారంటీ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. తమ పది సంవత్సరాల పని కేవలం ట్రైలర్ మాత్రమేనని చెప్పిన మోదీ- మరింత ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 10 వందేభారత్‌లను ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు.
పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు!
రూ.85వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు కూడా మోదీ శంకుస్థాపనలు/ప్రారంభోత్సవాలు చేశారు. వీరిలో కొన్నింటిని జాతికి అంకితం చేశారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో 9 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు, రెండు జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారంట్లను ప్రధాని నేడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కొళ్లం-తిరుపతి మెయిల్ ఎక్స్‌ప్రెస్, పలు మార్గాల్లో రెండో లైను, మూడో లైను, గేజు మార్పిడి, బైపాస్ లైన్లను ప్రారంభించారు.