తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​ వస్తే రామ మందిరానికి బాబ్రీ తాళం- అందుకే NDAకు 400 సీట్లు అవసరం' - lok sabha election 2024

PM Modi On India Alliance : కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు వెన్నుపోటు పొడిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాల్లో ప్రతిపక్షాలు పీకల్లోతుల్లో కూరుకుపోయాయని విమర్శించారు. ఒకవేళ ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే దేశంలో జీవించే మొదటి హక్కు తమ ఓటు బ్యాంక్‌కే ఉంటుందని పేర్కొనే ప్రమాదం ఉందన్నారు. తాను బతికి ఉన్నంతవరకు అలాంటి ప్రయత్నాలను సఫలం కానివ్వబోనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

PM Modi On India Alliance :
PM Modi On India Alliance : (ANI)

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 5:13 PM IST

PM Modi On India Alliance : లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌లో ప్రతిపక్షం ఓడిపోయిందని, రెండో విడతలో విధ్వంసమైందని, మూడోవిడతలో ఇండియా కూటమి తన వద్ద మిగిలిన స్థానాలను కోల్పోనుందని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. ఎందుకంటే దేశప్రజలు మరోసారి భారతీయ జనతా పార్టీకి అధికారం కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, కాంగ్రెస్‌, ఇండియా కూటమి అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

వారసత్వ రాజకీయాలు చేసే వారు మొదట దేశచరిత్రను వక్రీకరించి, స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహా నేతలను ప్రజలు మరచిపోయేలా చేశారని ప్రధాని మోదీ మండిపడ్డారు. వారు తామే గొప్పవారమని ప్రజలు చెప్పుకునేలా చరిత్రను తప్పుగా రాశారని, ఇప్పుడు రాజ్యాంగంపై కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కశ్మీర్‌లో 370 అధికరణను తిరిగి పునరుద్ధరించకుండా, రామ మందిరానికి బాబ్రీ తాళం వేయకుండా, OBC కోటాను లూటీ చేయకుండా హస్తం పార్టీని అడ్డుకునేందుకే ఎన్​డీఏకు 400సీట్లు కట్టబెట్టాలని కోరుతున్నట్లు చెప్పారు. తమకు ఇదివరకే ఉన్న 400సీట్లను 370అధికరణ రద్దు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగించటానికి, ఓ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేయటానికి వినియోగించినట్లు ప్రధాని మోదీ చెప్పారు.

"కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలు ఇప్పుడు కొత్త ప్రచారం చేస్తున్నారు. మోదీకి 400 సీట్లు లభిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చెబుతున్నారు. ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారు కదా? వారికి తెలివి ఉందా లేదా అని చెప్పాలన్నా కూడా నాకు పెద్ద సవాలే. వారికి తెలియాల్సిన విషయం ఏమంటే 2019 నుంచి 2024 వరకు మోదీ వద్ద ఎన్​డీఏ, ఎన్​డీఏ ప్లస్‌ రూపంలో 400 సీట్ల మద్దతు ఉండేది. వారికి ఇది కూడా గుర్తులేదు. ఎందుకంటే ప్రజల కొట్టిన దెబ్బకు ఇప్పటివరకు వారికి స్పృహ రాలేదు. 2019 తర్వాత 300 సీట్లు ఎన్​డీఏకు ఉన్నాయి. మూడు నాలుగు ప్రాంతీయపార్టీలు, స్వతంత్రులు ఐదేళ్లు మా వెంట ఉన్నారు. అవన్నీ కలిపితే ఎన్​డీఏ లెక్క దాదాపు 400వరకు ఉంటుంది. మోదీ అధికరణ 370ని రద్దు చేసేందుకు ఆ 400 సీట్లను ఉపయోగించారు."

--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలు కుహనా లౌకికవాదం పేరుతో బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. దాణా కుంభకోణంలో బెయిల్‌పై విడుదలైన ఆర్​జేడీ నేత ఒకరు ముస్లింలకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు ఉండాలని అంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా లాక్కోని ముస్లింలకు పూర్తిస్థాయి రిజర్వేషన్లు కల్పించాలని భావిస్తున్నట్లు ప్రధాని మోదీ విమర్శించారు. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కానివ్వబోనని స్పష్టం చేశారు.

"నేను పూర్తి అవగాహనతోనే చెబుతున్నా. కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలు ఈ మాట వినాలి. మోదీ బతికి ఉన్నంత వరకు కుహనా లౌకికవాదం పేరుతో దేశం గుర్తింపును తుడిచిపెట్టేందుకు చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా మోదీ అడ్డుకుంటాడు. ఇది వేలాది సంవత్సరాల భారత్‌కు మీ బిడ్డ మోదీ ఇస్తున్న గ్యారంటీ."

--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఆ తర్వాత మహారాష్ట్రలో జరిగిన ప్రచార సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, ఇండి కూటమి గడువు తేదీ జూన్‌ 4తో ముగియనుందన్నారు. ఎన్నికలను సంతృప్తి రాజకీయలు, బుజ్జగింపు రాజకీయాలకు మధ్య పోరాటంగా అభివర్ణించారు.

విపక్షాలకు పాకిస్థాన్​పై ఎందుకా ప్రేమ? భారత సైన్యంపై ద్వేషమెందుకు?: మోదీ - lok sabha elections 2024

గోద్రా అల్లర్లపై మోదీ కీలక వ్యాఖ్యలు- మూడో విడత వేళ ప్రతిపక్షాలపై ఫుల్​ ఫైర్​! - lok sabha election 2024

ABOUT THE AUTHOR

...view details