PM Modi On INDIA Alliance : వచ్చే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు కావాలని ఇండియా కూటమి మాట్లాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆవు పాలు ఇవ్వకముందే నెయ్యి గురించి గొడవ మొదలైందని (ప్రధాని పదవిపై పోటీని ఉద్దేశించి) ఎద్దేవా చేశారు. తాను జీవించి ఉన్నంతవరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని తెలిపారు. హరియాణాలోని మహేంద్రగఢ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.
రిజర్వేషన్లకు మోదీ గ్యారెంటీ
'ఈ లోక్‌సభ ఎన్నికల ద్వారా ప్రజలు దేశ ప్రధానిని ఎన్నుకోవడమే కాకుండా దేశ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తారు. ఒకవైపు మీ సేవకుడు మోదీ. మరోవైపు ఎవరు ఉన్నారో ఎవరికీ తెలియదు. ఇండియా కూటమి అత్యంత మతతత్వ, కులతత్వ, బంధుప్రీతి ఉన్న పార్టీల కలయిక. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుమతివ్వలేదు. బంగాల్లో టీఎంసీ సర్కార్ రాత్రికి రాత్రే ముస్లింలకు(చొరబాటుదారులకు) ఓబీసీ సర్టిఫికేట్‌లను జారీ చేసింది. గత 10-12 ఏళ్లలో ముస్లింలకు జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్‌లను కలకత్తా హైకోర్టు చెల్లుబాటు కాకుండా చేసింది. కాంగ్రెస్, టీఎంసీ, ఇండియా కూటమి పార్టీలు వారి ఓటు బ్యాంకుకు మద్దతు ఇస్తున్నాయి. అయితే మోదీ బతికున్నంతకాలం దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరు. నేను ప్రజలకు గ్యారెంటీ ఇస్తున్నా. మోదీ మీ రిజర్వేషన్లకు కాపలాదారు. అణగారిన వారి హక్కుల కోసం పోరాడతాను. ఇది రాజకీయ ప్రసంగం కాదు. మోదీ గ్యారెంటీ. ' అని ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.