PM Modi Meeting With Bill Gates :తన గొంతును డీప్‌ఫేక్ టెక్నాలజీతో అనుకరించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆధునిక సాంకేతికత, ప్రజల మధ్య డిజిటల్ విభజనను తాను అనుమతించనని ప్రధాని తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాలలో సాంకేతికత పెద్ద పాత్ర పోషిస్తుందని చెప్పారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌తో దిల్లీలోని తన అధికారిక నివాసంలో ప్రధాని చాయ్ పే చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ పేమెంట్స్, వాతావరణ మార్పులు వంటి అనేక అంశాలపై ఇరువురు చర్చించారు.
'డీప్‌ఫేక్‌తో నా గొంతునూ అనుకరించారు'
'సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి నేను ఇష్టపడతాను. అయితే ఇందులో నేను నిపుణుడిని కాదు. కాని కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ఉత్సుకతతో ఉంటా. మా అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సులో ఏఐ టెక్నాలజీని వినియోగించుకున్నాం. ఏఐతో హిందీలో చేసిన నా ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించాం. ఏఐ శక్తిమంతమైనదే. కానీ దాన్ని మ్యాజిక్ టూల్‌గా ఉపయోగిస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వక్రమార్గంలో పయనిస్తుంది. డీప్‌ఫేక్‌తో నా గొంతును కూడా అనుకరించారు' అని మోదీ వెల్లడించారు.
మోదీ మాట్లాడిన దానికి బిల్‌గేట్స్ బదులిచ్చారు. 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మనం ప్రారంభ దశలో ఉన్నాం. మనం కష్టం అనుకున్నవి సులువుగా చేస్తుంది. తేలికని భావించే వాటిలో విఫలమవుతోంది. కృత్రిమ మేధ అనేది పెద్ద అవకాశం. కానీ దాంతో కొన్ని సవాళ్లూ ఉన్నాయి' అని అన్నారు. దీనికి మోదీ స్పందిస్తూ ఏఐ సృష్టించే కంటెంట్‌కు వాటర్‌మార్క్‌లు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఎవరూ దీన్ని తప్పుదోవ పట్టించలేరని తెలిపారు.
నమో యాప్‌లో కృత్రిమ మేధ
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్ ముఖ్యంగా కృత్రిమ మేథ, దాని ప్రయోజనాలపై ఎక్కువగా మాట్లాడుకున్నారు. 2023 G20 సదస్సులో ఏఐ సాంకేతికత ఎలా ఉపయోగపడిందో ప్రధాని వివరించారు. అంతేకాకుండా కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో తన హిందీ ప్రసంగం తమిళంలోకి ఎలా అనువాదం అయిందో తెలిపారు. నమో యాప్‌లో కృత్రిమ మేధ వినియోగం గురించి ప్రస్తావించారు. చరిత్రాత్మకంగా, మొదటి, రెండో పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్ వేరే వాళ్ల ఆధీనంలో ఉండటం వల్ల వెనుకబడిందని చెప్పారు. కానీ ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లపం మధ్యలో ఉన్నామనీ, ఇప్పుడు డిజిటలైజేషన్ దాని ప్రధానాంశంగా ఉందని పేర్కొన్నారు. వీటి నుంచి భారత్ చాలా ప్రయోజనం పొందుతుందని తాను భావిస్తున్నట్టు ప్రధాని తెలిపారు.