PM Modi Fan Cycle Yatra :తన అభిమాన నాయకుడు నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించాలని సైకిల్ యాత్రను చేపట్టింది ఓ ముస్లిం యువతి. రోజుకు 80 నుంచి 90 కిలోమీటర్లు తొక్కుతూ తన అభిమాన నాయకుడి కోసం శ్రమిస్తోంది. మరో 7-8 నెలల్లో సైకిల్ యాత్రను పూర్తి చేస్తానని ధీమాగా చెబుతోంది. సైకిల్‌కు కాషాయ జెండాలు కట్టి అందంగా తీర్చిదిద్ది చూపరులను ఆకట్టుకునేలా చేసింది. అసలు ఎవరు ఈ యువతి? ఎక్కడకి సైకిల్‌పై యాత్ర చేస్తుంది? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.
నరేంద్ర మోదీ మూడో సారి ప్రధాని పదవి చేపట్టాలని మహారాష్ట్రలోని ముంబయికు చెందిన షబ్నమ్ షేక్ అనే యువతి సైకిల్ యాత్ర చేపట్టింది. సైకిల్‌పై 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు సిద్ధమైంది. తన స్నేహితుడితో కలిసి సైకిల్‌ను హుషారుగా తొక్కుతూ ఇప్పటికే మహారాష్ట్రలో ఉన్న రెండు జ్యోతిర్లింగాలను దర్శించుకుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని ఓం కారేశ్వర్ వెళ్లనున్నట్లు షబ్నమ్ చెప్పింది. ఆ తర్వాత ఉజ్జయిన్‌లోని బాబా మహాకాల్‌ను దర్శించుకుని నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని పదవి చేపట్టాలని దేవుడ్ని కోరుకోనున్నట్లు తెలిపింది.
తాజాగా షబ్నమ్ షేక్ చేపడుకున్న సైకిల్ యాత్ర మధ్యప్రదేశ్‌లోని బడ్వానీ జిల్లాకు చేరుకుంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ షబ్నమ్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించింది. 'నేను నా స్నేహితుడితో కలిసి సైకిల్ యాత్ర ప్రారంభించా. నేను ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమానిని. మరోసారి ఆయనే ప్రధాని పీఠాన్ని అధిరోహించాలని కోరుకుంటున్నా. అందుకోసమే ముంబయి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు సైకిల్ యాత్ర చేపడుతున్నా.' అని షబ్నమ్ షేక్ తెలిపింది.