PM Modi Comments On Congress Royal Family :దేశాన్ని పాలించడానికే తాము పుట్టామని కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ (గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి) భావిస్తోందని, ఆ పార్టీ మనస్తత్వం అదే అని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీల అభివృద్ధి కుంటుపడడానికి కాంగ్రెస్ కారణం అని ఆరోపించారు. రిజర్వేషన్లు అంటేనే కాంగ్రెస్ చిరాకు పడుతోందని మండిపడ్డారు. 1980 దశకంలో రాజీవ్ గాంధీ పార్టీకి నాయకత్వం వహించినప్పుడు- దళితులు, ఆదివాసీలు అనుభవిస్తున్న ప్రత్యేక హక్కులను ప్రశ్నిస్తూ ఓ ప్రకటన ప్రచురించారని గుర్తుచేశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారని, ఇది ఆ పార్టీ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని ప్రతిబింబిస్తోందని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రాపుర్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
"దేశాన్ని విచ్ఛిన్న చేయడానికి కాంగ్రెస్ ఆడుతున్న డేంజరెస్ గేమ్. ఒకవేళ ఆదివాసీలు కులాలుగా విడిపోతే వారి గుర్తుంపు, ఐక్యత విచ్ఛిన్నమవుతాయి. కాంగ్రెస్ యువరాజు విదేశాల్లో ఉన్నప్పుడు ఆయనే స్వయంగా ప్రకటించారు. అందుకే కాంగ్రెస్ చేస్తున్న ఈ కుట్రను మనం బలి కాకూడదు. మనం ఐక్యంగా ఉండాలి. మహావికాస్ అఘాడీ(ఎమ్వీఏ) అతి పెద్ద అవినీతి కూటమి. రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డుపడుతోంది."
--ప్రధాని నరేంద్ర మోదీ
డెవలప్మెంట్ అడ్డుకోవడంలో ప్రతిపక్షాలు డబుల్ PhD
అభివృద్ధిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ డబుల్ పీహెచ్‌డీ చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల మహారాష్ట్ర గత రెండున్నరేళ్లలో డబుల్ స్పీడ్‌తో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ గడ్డపై 12 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని, 100 రైల్వేస్టేషన్లను ఆధునీకరించామని వెల్లడించారు.