తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇండియా'లో ఎవరి దారి వారిదే- కశ్మీర్​లో PDP, NC విడివిడిగా పోటీ - jammu kashmir lok sabha election

Jammu Kashmir Lok Sabha Election 2024 : ఇండియా కూటమిలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. జమ్ముకశ్మీర్​లో కూటమిలో భాగస్వామ్య పక్షాలైన నేషనల్​ కాన్ఫరెన్స్​, పీడీపీ పార్టీలు వేర్వేరుగా పోటీ చేయనున్నాయి. మరోవైపు ఆరోగ్య కారణాలతో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.

Jammu Kashmir Lok Sabha Election 2024
Jammu Kashmir Lok Sabha Election 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 5:50 PM IST

Jammu Kashmir Lok Sabha Election 2024 : జమ్ముకశ్మీర్​లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన పీడీపీ, నేషనల్​ కాన్ఫరెన్స్​ పార్టీలు మూడు స్థానాల్లో వేర్వేరుగా పోటీ చేయనున్నాయి. ఎన్నికల్లో పోటీ తప్ప నేషనల్​ కాన్ఫరెన్స్​ మరో అవకాశం లేకుండా చేసిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పీడీపీ అధ్యక్షురాలు మొహబుబా ముఫ్తీ బుధవారం వెల్లడించారు. త్వరలోనే అభ్యర్థుల ఎంపికపై పార్టీ పార్లమెంటరీ బోర్డ్ తుది నిర్ణయం తీసుకుంటుందని ముఫ్తీ తెలిపారు.

"ముంబయిలో ఇండియా కూటమి సమావేశం జరిగినప్పుడు సీట్ల సర్దుబాటుపై ఫరూఖ్​ అబ్దుల్లా నిర్ణయం తీసుకుంటారని చెప్పాను. పార్టీ ప్రయోజనాలను పక్కనుబెట్టి మాకు న్యాయం చేస్తారని అనుకున్నా. కానీ ఆయన మూడు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఒకవేళ అబ్దుల్లా తమను సంప్రదించి ఉంటే కశ్మీర్​ ప్రయోజనాల దృష్ట్యా అభ్యర్థులను నిలబెట్టేవాళ్లం కాదు. కానీ అబ్దుల్లా మమ్మల్ని సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారు. పీడీపీకి కార్యకర్తలు, ప్రజల మద్దతు లేదని, ఒక్క సీటు గెలవదని చెప్పారు. ఇది మా కార్యకర్తలను తీవ్రంగా గాయపరించింది."

--పీడీపీ అధ్యక్షురాలు మొహబుబా ముఫ్తీ

2019లో జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హోదా తీసివేశాక రాష్ట్రంలోని పార్టీలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. యువత జైళ్లలో మగ్గుతున్నా ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులపై పోరాడేందుకు అందరం ఏకంగా ఉండాలని సూచించారు. అంతకుముందు సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్​తో చర్చల సమయంలో కశ్మీర్​ లోయలోని మూడు సీట్లలో తామే పోటీ చేస్తామంటూ నేషనల్​ కాన్ఫెరెన్స్​ స్పష్టం చేసింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్​కు జమ్ములో రెండు సీట్లను కేటాయించింది ఎన్​సీ.

పోటీ నుంచి తప్పుకున్న ఫరూఖ్‌ అబ్దుల్లా
నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆరోగ్య కారణాలతో ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. శ్రీనగర్‌ శివారులోని రావల్‌పొర్‌లో జరిగిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సమావేశంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఆ విషయాన్ని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకునే విషయమై ఫరూఖ్ అబ్దుల్లా, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఇతర సభ్యుల అనుమతి తీసుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌లో గెలిచే అభ్యర్థిని బరిలో దింపాల్సిన చేయాల్సిన బాధ్యత పార్టీపై ఉందని ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపిస్తే దిల్లీలో శ్రీనగర్​ గొంతును వినిపిస్తారని చెప్పారు. గత ఎన్నికల్లో శ్రీనగర్‌ నుంచి ఫరూఖ్‌ అబ్దుల్లా ఎంపీగా గెలుపొందారు.

ABOUT THE AUTHOR

...view details