Naresh Meena Rajasthan : రాజస్థాన్ టోంక్ జిల్లాలోని సమరావత్ గ్రామంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిని స్వతంత్ర అభ్యర్థి నరేశ్ మీనా చెంప దెబ్బ కొట్టిన వ్యవహారం హింసాత్మక ఘటనలకు దారి తీసింది. అందరూ చూస్తుండగానే నరేశ్ మీనా, SDM అమిత్ చౌధరి చెంపపై కొట్టారు. పోలీసులు నరేశ్ మీనాను అరెస్టు చేసేందుకు యత్నించగా ఆయన మద్దతుదారులు అడ్డుపడి రాళ్లు రువ్వారు. దాదాపు 80 వాహనాలకు నిప్పు పెట్టారు. అందులో పలు పోలీసు వాహనాలు, 60 ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నరేశ్ మీనాపై ఆస్తుల ధ్వంసం, ఎన్నికల విధులకు అడ్డుపడటం సహా 4 కేసులు నమోదు చేశారు. ఎన్నికల అధికారిపై దాడిని నిరసిస్తూ రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులు నిరసన వ్యక్తం చేశారు.
#WATCH | Tonk, Rajastha: Police arrests Naresh Meena from Samravata VIllage.
— ANI (@ANI) November 14, 2024
Naresh Meena, independent candidate for Deoli Uniara assembly constituency by-polls in Tonk district, after he allegedly physically assaulted SDM Amit Chaudhary at a polling booth yesterday pic.twitter.com/v8meme4qsw
సమరావత్ గ్రామంలో ఉన్న నరేశ్ మీనాను అదుపులోకి తీసుకునేందుకు గురువారం వందల సంఖ్యలో పోలీసులు వెళ్లారు. లొంగిపోవాలని పోలీసులు సూచించినా ఆయన వినలేదు. దీంతో బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నరేశ్ మీనాను పోలీసులు తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ ఆయన మద్దతుదారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ క్రమంలోనే కొందరు మద్దతుదారులు సమీపంలోని ఓ రహదారిపై టైర్లను అడ్డుపెట్టి నిప్పు పెట్టారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు వాటిని తొలగించారు. బుధవారం నాటి రాళ్ల దాడి ఘటనకు సంబంధించి 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాళ్ల దాడిలో గ్రామస్థులు మాత్రమే కాకుండా బయటి నుంచి వచ్చిన వ్యక్తులు పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
#WATCH | Tonk, Rajasthan: Supporters of Naresh Meena set fire on the state highway outside Samravata village, to protest against this arrest. pic.twitter.com/NU5lX2OP3I
— ANI (@ANI) November 14, 2024
కాంగ్రెస్ రెబల్ నేత అయిన నరేశ్ మీనా బుధవారం పోలింగ్ విధులు నిర్వహిస్తున్న SDM అమిత్ చౌధరి కాలర్ లాగి చెంప దెబ్బ కొట్టారు. సమరావత్ గ్రామాన్నిదేవలీలో కాకుండా ఉనియారా తహసీల్లో కలపాలని ఆ గ్రామస్థులు డిమాండ్ చేస్తూ ఉప ఎన్నికను బహిష్కరించారు. వారికి నరేశ్ మీనా మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఓటు హక్కు వినియోగించుకోవాలని సమరావత్ గ్రామస్థులకు SDM అమిత్ చౌధరి సూచించారు. పలువురితో అమిత్ చాధరి ఓటు వేయించారని ఆగ్రహం చెందిన నరేశ్ మీనా అందరూ చూస్తుండగానే ఆయన కాలర్ పట్టుకుని చెంపై కొట్టారు.