Parrot Owner Held Predicted Poll Result :మరికొద్ది రోజుల్లో లోక్ సభ మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. పలు పార్టీల అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులో పీఎంకే పార్టీ తరఫున పోటీ చేస్తున్న కడలూర్ ఎంపీ అభ్యర్థి థంకర్ బచ్చన్ గెలుస్తారని చిలక జోస్యం చెప్పిన ఇద్దరు జ్యోతిష్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిలుకలను పంజరంలో బంధించారనే అభియోగాలపై వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కాసేపటి తర్వాత వారిని విడిచిపెట్టినట్లు అటవీ శాఖ అధికారి తెలిపారు.
కాగా, కడలూరు నియోజకవర్గం నుంచి పీఎంకే పార్టీ తరఫున సినీ దర్శకుడు థంకర్ బచ్చన్ బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఆయన జ్యోతిష్యులను సంప్రదించగా లోక్ సభ ఎన్నికల్లో బచ్చన్ గెలుస్తారని జ్యోతిష్య సోదరులు చెప్పారు. జ్యోతిష్యులు తమ దగ్గర ఉన్న నాలుగు చిలుకలలో ఒకదానితో కార్డును తీయించి జోస్యం చెప్పారు. జ్యోతిష్యులను బచ్చన్ సంప్రదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బచ్చన్ ఓ చిలుకకు ఆహారం ఇవ్వమని జ్యోతిష్యుడిని అభ్యర్థించడం దానికి అతడు అరటి పండు అందించడం వంటివి అందులో ఉన్నాయి. ఈ విషయం అటవీ అధికారుల దృష్టికి చేరింది. దీంతో వారు జ్యోతిష్యులపై చర్యలకు దిగారు. వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందున రెండు బోనుల్లో ఉంచిన నాలుగు చిలుకలను స్వాధీనం చేసుకున్నారు. జ్యోతిష్య సోదరులను అరెస్ట్ చేసి మళ్లీ విడిచిపెట్టారు.