Oppositions On CAA Rules Notification : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలు నిబంధనలను నోటిఫై చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా టీఎంసీ, సీపీఐ పార్టీలు సీఏఏ అమలును వ్యతిరేకించాయి. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు సీఏఏ అమలు చేసి ఓట్ల చీల్చేలా ప్రణాళిక రచించిందని ఆరోపించింది కాంగ్రెస్. సుప్రీం కోర్టు ఎలక్టోరల్ బాండ్లపై కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాని దృష్టిని మరల్చడానికి సీఏఏ ప్రకటన చేశారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు.
"సీఏఏ చట్టం ఆమోదం పొందిన తర్వాత నిబంధనలు రూపొందించడానికి మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల మూడు నెలల సమయం తీసుకుంది. నిబంధనల వెల్లడికి సుమారు 9గడువు పెంపునకు అనుమతులు తీసుకుంది. సరిగ్గా ఎన్నికల ముందు ఓట్లను చీల్చేలా ప్రణాళిక రచించి ఇప్పుడు తీసుకువచ్చింది. ముఖ్యంగా బంగాల్, అసోంలో ఓట్లను చీల్చేలా ఈ సమయాన్ని ఎంపిక చేసుకుంది."
--జైరాం రమేశ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
నిబంధనలు పరిశీలించి స్పందిస్తాం : మమత
మొదటి నుంచి పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రజలపై వివక్ష చూపే విధంగా ఉంటే తాను అడ్డుకుంటానని చెప్పారు. బంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో సీఏఏ సున్నితమైన అంశమని, ఎన్నికల ముందు అశాంతిని కోరుకోవడం లేదన్నారు. నిబంధనలను పరిశీలించిన తర్వాత ఈ అంశంపై పూర్తిగా మాట్లాడుతామని తెలిపారు.
'మత విభజనకు వ్యతిరేకం'
పౌరసత్వ సవరణ చట్టం మతాల మధ్య విభేదాలను సృష్టిస్తుందన్నారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఈ చట్టం ముస్లింలను రెండో స్థాయి పౌరులుగా మారుస్తాయని, దీనిని రాష్ట్రంలో అమలు కాకుండా చూస్తామని స్పష్టం చేశారు. మతాల మధ్య విభజనకు వ్యతిరేకంగా కేరళ నిలబడుతుందని చెప్పారు. మరోవైపు సీఏఏ నిబంధనలను నోటిఫై చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దిల్లీలోని షహీన్ బాగ్, జామియా లాంటి సున్నిత ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.