PM Modi Attacks Congress :బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ సమర్థించారు. అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా బహిర్గతం చేశారని, దీంతో హస్తం పార్టీ ఉలిక్కిపడిందని బుధవారం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కొన్నేళ్లపాటు దేశంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. మంగళవారం రాజ్యాంగంపై చర్చ సందర్భంగా బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించేలా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు.
"అంబేడ్కర్‌ను అవమానించిన, ఎస్సీ, ఎస్టీ వర్గాలను విస్మరించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను పార్లమెంట్ వేదికగా అమిత్ షా బట్టబయలు చేశారు. ఆయన చెప్పిన వాస్తవాలను చూసి కాంగ్రెస్ ఉలిక్కిపడింది. అందుకే పాపం వారు ఇప్పుడు నాటకాలాడుతున్నారు. ప్రజలకు నిజమేంటో తెలుసు. అంబేడ్కర్‌ను లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండుసార్లు ఓడిపోయేలా చేసింది. నెహ్రూ ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. అలాగే బాబా సాహెబ్‌కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. అంబేడ్కర్ చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో పెట్టడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది."
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
'ఆ పార్టీవి డర్టీ ట్రిక్స్'
అంబేడ్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి, ఎస్సీ, ఎస్టీలను కించపరచడానికి రాజవంశం నేతృత్వంలోని ఒక పార్టీ ప్రతి డర్టీ ట్రిక్స్ ఎలా చేస్తుందో దేశ ప్రజలు పదేపదే చూస్తున్నారని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు వ్యాప్తి చేసే అబద్దాలు వారి పరిపాలనలోని ఆకృత్యాలను దాచగలవని భావిస్తున్నారని, అందుకే ప్రజలు వారిని తీవ్రంగా తప్పుపడుతున్నారని ఎద్దేవా చేశారు.
"గత దశాబ్ద కాలంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసింది. 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి చేశాం. అలాగే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేశాం. స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన వంటి కార్యక్రమాలను గత పదేళ్లలో చేపట్టాం. పేద, అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలను అందించాం. అంబేడ్కర్‌తో అనుబంధం ఉన్న ఐదు ప్రసిద్ధ ప్రదేశాలైన పంచతీర్థాన్ని అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేసింది. దశాబ్దాలుగా చైత్ర భూమికి సంబంధించిన సమస్య పెండింగ్‌లో ఉంది. మా ప్రభుత్వం సమస్యను పరిష్కరించింది. అంతేకాదు నేను స్వయంగా అక్కడ ప్రార్థనకు వెళ్లాను. " అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
అమిత్ షా రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్
రాజ్యాంగంపై జరిగిన చర్చ సందర్భంగా బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ బుధవారం ఉదయం డిమాండ్ చేసింది. రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకుగానూ అమిత్ షా బహిరంగంగా, పార్లమెంటులో క్షమాపణ చెప్పాలని కోరింది. రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు రాజ్యాంగంపై ఉన్న ద్వేషానికి అద్దం పడుతున్నాయని ఆరోపించింది.
'బాబా సాహెబ్‌ను విమర్శిస్తే ఊరుకోం'
అమిత్ షా అంబేడ్కర్, భారత రాజ్యాంగాన్ని అవమానించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఆయనకు మనుస్మృతి, ఆర్ఎస్ఎస్ భావజాలం- బాబా సాహెబ్ అంబేడ్కర్, ఆయన రచించిన రాజ్యాంగాన్ని గౌరవించకూడదని నేర్పుతోందని ఆరోపించారు. అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.