Old Couple Avoids Major Train Accident : పట్టాలపై బోల్తా పడ్డ లారీ- ఎదురుగా వేగంగా దూసుకొస్తున్న రైలు- చుట్టూ ఎవరూ లేరు- చేతిలో ఓ టార్చ్‌లైట్- ఇలాంటి పరిస్థితిలో వృద్ధ దంపతులు సాహసం చేశారు. రైలు ప్రమాదానికి గురికాకుండా చేసేందుకు ట్రైన్ వచ్చే దారిలో ఎదురెళ్లి హెచ్చరిక సిగ్నల్ ఇచ్చారు. టార్చ్లైట్తోనే రైలు లోకో పైలట్‌కు సిగ్నల్ ఇచ్చి ఘోర దుర్ఘటన జరగకుండా నిలువరించారు. తమిళనాడులో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
కేరళ నుంచి ప్లైఉడ్ లోడుతో వస్తున్న ఓ లారీ తమిళనాడు సరిహద్దులో ప్రమాదానికి గురైంది. తూత్తుకుడికి వెళ్లాల్సిన ఆ లారీ ఎస్.వేలవు ప్రాంతంలో అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై బోల్తా పడింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అదేసమయంలో తిరునెల్వేలి నుంచి కేరళలోని పాలక్కడ్‌కు వెళ్లే ఓ రైలు ఆ మార్గం గుండా వచ్చింది.
దంపతుల సిగ్నల్- పైలట్ అలర్ట్
ఆ సమయంలో అక్కడే ఉన్న షన్ముగయ్య, కురుంతామ్మల్ దంపతులు రైలును ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకున్నారు. వెంటనే రైలు వచ్చే మార్గంలో పరిగెత్తారు. చేతిలో ఉన్న టార్చ్లైట్తో రైలు లోకో పైలట్‌కు సిగ్నల్ ఇచ్చారు. వృద్ధుల సిగ్నల్‌ను గమనించిన లోకో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. బ్రేకులు వేసి రైలును ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.