Cashless Treatment Scheme : కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక పథకాన్ని ప్రకటించారు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే, చికిత్సకు అయ్యే ఖర్చులో గరిష్ఠంగా రూ.1.50 లక్షలు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అయితే ఇది మొదటి ఏడు రోజుల చికిత్సకు అయ్యే బిల్లుకు మాత్రమే వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రమాద ఘటన జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారాన్ని అందిస్తేనే ఈ స్కీం ద్వారా నగదు రహిత చికిత్సను పొందొచ్చని గడ్కరీ స్పష్టం చేశారు. హిట్ అండ్ రన్ కేసుల్లో చనిపోయే వారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందిస్తామన్నారు.
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స - మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా: నితిన్ గడ్కరీ - CASHLESS TREATMENT SCHEME
గవర్నమెంట్ క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ - చికిత్సకు రూ.1.5 లక్షలు - మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా
Published : Jan 8, 2025, 10:04 AM IST
|Updated : Jan 8, 2025, 10:15 AM IST
2024లో 1.80 లక్షల మంది మృతి
రోడ్డు భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని గడ్కరీ తెలిపారు. 2024 సంవత్సరంలో దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.80 లక్షల మంది చనిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. వీటిలో 30వేల మరణాలు కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లే జరిగాయని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల బారినపడిన వారిలో దాదాపు 66 శాతం మంది 18 నుంచి 34 ఏళ్లలోపు యువతే ఉన్నారని చెప్పారు.
10వేల మంది పిల్లలు కూడా
విద్యాసంస్థల పరిసరాల్లో సరైన ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ లేకపోవడం వల్ల గతేడాది దాదాపు 10 వేల మంది పిల్లలు రోడ్డు ప్రమాదాల బారినపడ్డారన్నారని నితిన్ గడ్కరీ తెలిపారు. అందుకే ఆటోరిక్షాలు, విద్యాసంస్థల మినీ బస్సుల పర్యవేక్షణ కోసం నియమాలను అమల్లోకి తేవాల్సి వచ్చిందని గడ్కరీ తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా శాఖ మంత్రులతో మంగళవారం దిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమావేశమయ్యారు. రోడ్డు రవాణా సంబంధిత పాలసీలపై వారితో కేంద్ర మంత్రి చర్చించారు. ఆ వెంటనే రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స స్కీంను ఆయన ప్రకటించడం గమనార్హం.