తెలంగాణ

telangana

ETV Bharat / bharat

PHD చేస్తారా? నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేస్తే చాలు- PG అక్కర్లేదు! - UGC NET Exam Rules - UGC NET EXAM RULES

NET Exam New Rules : నాలుగేళ్ల డిగ్రీ (ఉదా: బీటెక్​) పూర్తి చేసిన విద్యార్థులు ఇప్పుడు నేరుగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్- NET పరీక్షకు హాజరుకావచ్చు. నాలుగేళ్ల కోర్సులో 75 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు పీహెచ్‌డీని అభ్యసించవచ్చు. ఈ విషయాన్ని యూజీసీ ఛైర్మన్ జగదీశ్​ కుమార్ వెల్లడించారు.

NET Exam New Rules
NET Exam New Rules

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 7:18 PM IST

Updated : Apr 21, 2024, 8:51 PM IST

NET Exam New Rules :నాలుగేళ్ల డిగ్రీ(ఉదా: బీటెక్​) పూర్తి చేసిన విద్యార్థులు ఇప్పుడు నేరుగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్- NET పరీక్షకు హాజరుకావచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- UGC ఛైర్మన్ జగదీశ్ కుమార్ ప్రకటించారు. తద్వారా వారు పీహెచ్‌డీ చేయవచ్చన్నారు. అయితే, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) ఉన్నా, లేకపోయినా పీహెచ్‌డీ అభ్యసించేందుకు నాలుగేళ్ల డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌లు ఉంటే చాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి 55శాతం మార్కులు ఉన్న అభ్యర్థులను మాత్రమే నెట్‌కు అర్హులుగా పరిగణించేవారు.

తాజా నిర్ణయంతో ఇకపై నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ కలిగిన వారు నేరుగా యూజీసీ నెట్‌ (UGC NET) పరీక్ష రాసి పీహెచ్‌డీ చేసేందుకు అర్హులుగా నిర్ణయించినట్లు యూజీసీ ఛైర్మన్‌ తెలిపారు. ఈ అభ్యర్థులు డిగ్రీలో సబ్జెక్టులతో సంబంధం లేకుండా తాము ఎంచుకున్న అంశాల్లో పీహెచ్‌డీ చేయవచ్చన్నారు. అయితే, ఇందుకోసం వారు నాలుగేళ్ల డిగ్రీ లేదా ఎనిమిది సెమిస్టర్ల డిగ్రీ ప్రోగ్రామ్‌లో 75శాతం మార్కులు లేదా సమానమైన గ్రేడ్‌లను సాధించి ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (నాన్‌ క్రిమీ లేయర్‌), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన వారికి 5శాతం మార్కులు/గ్రేడ్‌లలో సడలింపు ఉంటుందన్నారు. యూజీసీ ఎప్పటికప్పుడు తీసుకొనే నిర్ణయం ప్రకారం ఇది మారుతూ ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల నాలుగేళ్ల డిగ్రీ పూర్తయినవారితో పాటు ప్రస్తుతం ఎనిమిదో సెమిస్టర్‌లో ఉన్న విద్యార్థులు సైతం యూజీసీ నెట్‌ (జూన్‌ సెషన్‌)కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరోవైపు, యూజీసీ నెట్‌ (జూన్‌) సెషన్‌కు సంబంధించి శనివారం నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.

యూజీసీ నెట్‌ (జూన్‌) నోటిఫికేషన్‌ విడుదల
మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే పెన్ను, పేపర్‌ (ఓఎంఆర్‌ షీట్‌) ఆధారిత పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలైనట్లు యూజీసీ ఇటీవల వెల్లడించింది. ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా జూన్‌ 16న NTA ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. జనరల్‌/అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.1150, జనరల్‌-ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్‌ జెండర్‌కు రూ.325 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్‌లో కీలక అంశాలివే!

  • మే 10 రాత్రి 11.50గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
  • అప్లికేషన్‌ రుసుంను మే 11 నుంచి 12 రాత్రి 11.50గంటల వరకు చెల్లించవచ్చు.
  • దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే మే 13 నుంచి 15వరకు సరిచేసుకోవచ్చు.
  • వయో పరిమితి: జేఆర్‌ఎఫ్‌కు 01.06.2024 నాటికి 30 ఏళ్లు మించరాదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయో పరిమితి ఏం లేదు.
  • పరీక్ష ఇలా: పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. ఆబ్జెక్టివ్‌, మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. 180 నిమిషాల పాటు జరుగుతుంది. పేపర్లు ఇంగ్లిష్‌, హిందీలో మాత్రమే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. తప్పు సమాధానానికి నెగిటివ్‌ మార్కులు లేవు.
Last Updated : Apr 21, 2024, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details