NEET UG Paper Leak CBI : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్‌లో కీలక పరిణామం! పేపర్ లీక్ ప్రధాన నిందితుడిని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అరెస్ట్ చేసింది. ఝార్ఖండ్ హజారీబాగ్‌లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ప్రశ్నాపత్రాన్ని దొంగిలించిన పంకజ్ కుమార్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇతడితో పాటు పేపర్ లీక్‌కు సహకరించిన మరో వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటివరకు పేపర్ లీక్ కేసులో అరెస్టైన వారి సంఖ్య 14కు చేరింది.
నిట్ జంషెడ్పుర్లో 2017 బ్యాచ్ సివిల్ ఇంజినీర్ అయిన పంకజ్ కుమార్- హజారీబాగ్‌లోని ఎన్టీఐ ట్రంక్ పెట్టెల నుంచి నీట్ ప్రశ్నాపత్రాన్ని దొంగిలించాడు. అనంతరం రాజు సింగ్ అనే వ్యక్తికి అందజేయగా, అతడు తన గ్యాంగ్ సభ్యులకు చేరవేశాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని అరెస్ట్ చేసింది సీబీఐ. బొకారోకు చెందిన పంకజ్ కుమార్‌ను బిహార్ రాజధాని పట్నాలో అరెస్ట్ చేయగా, రాజును హజారీబాగ్‌లో అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే హజారీబాగ్‌లో ఇద్దరు అరెస్ట్
ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఆరు ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐ అధికారులు నమోదు చేశారు. ఇందులో బిహార్‌లో పేపర్ లీక్‌పై కేసు నమోదు కాగా, మిగిలిన ఐదు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు కేంద్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు సీబీఐ సొంతంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. అక్కడ కాలిపోయిన ప్రశ్నపత్రాలను బిహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.