NDA Jayant Chaudhary RLD :ఇండియా కూటమికి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్ని రోజులు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరింది. ఈ మేరకు గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ఆ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి తెరదించుతూ ఈ ప్రకటన చేశారు. ఇప్పుడు ఎన్డీఏలో ఆర్ఎల్డీ భాగమని స్పష్టం చేశారు. అయితే దీనికోసం పెద్ద ప్లానింగ్ ఏం చేయలేదని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో తక్కువ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.
ఇటీవల మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్‌కు మరణాంతరం భారతరత్న పురస్కారం ప్రకటించింది బీజేపీ. తాజాగా చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన మనవడు జయంత్ చౌదరి కూటమి మార్పుపై ప్రకటన చేయడం గమనార్హం.
అయితే గత కొద్ది కాలంగా ఆర్ఎల్డీ, బీజేపీ పొత్తుపై పలు ఊహాగానాలు వినిపించాయి. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌తో ఉన్న పొత్తు నుంచి బయటకు వచ్చేందుకు ఆ పార్టీ అధినేత జయంత్ చౌదరి యోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై బీజేపీ అగ్రనాయకత్వంతోనూ చర్చలు కూడా జరిగాయని టాక్ వచ్చింది. దీంతో పాటు సీట్ల సర్దుబాటుపై కూడా చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
సీట్ల సర్దుబాటు
తాజాగా జయంత్ చౌదరి చేసిన ప్రకటనలో సీట్ షేరింగ్ ప్రస్తావన రాలేదు. కానీ అంతకుముందు ఆర్ఎల్డీ నేతలు ఏడు లోక్‌సభ స్థానాలను డిమాండ్ చేయగా, బీజేపీ 5సీట్ల వరకు ఇచ్చేందుకు సానుకూలత చూపించినట్లు ప్రచారం జరిగింది.