RSS Chief Mohan Bhagwat Speech :భారత్‌ను ఒక ముప్పుగా చూపించేందుకు బంగ్లాదేశ్‌లో కుట్రలు జరుగుతున్నాయని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. "మన సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. హిందువులను శత్రువులుగా చూసే పరిస్థితి తీసుకువస్తున్నారు. మన సంకల్పాన్ని బలహీన పరిచేందుకు, భారత్‌ను అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నారు" అని మోహన్ భగవత్ ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్‌లో నిరంకుశ ఛాందసవాదం రాజ్యమేలుతోందని ఆరోపించారు. అక్కడి హిందువులతో సహా మైనారిటీల తలలపై కత్తి వేలాడుతోందని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం నాగ్‌పుర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి ఉత్సవ్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయుధ పూజ చేసిన మోహన్ భగవత్ బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
నేరస్థులను రక్షించే ప్రయత్నం!
మహిళలపై అకృత్యాలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన మన సమాజానికి సిగ్గుచేటని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. నేరం జరిగి ఇంతకాలమైనా, బాధితురాలికి న్యాయం జరగకపోవడం సమాజాన్ని తీవ్రంగా నిరుత్సాహపరుస్తోందని అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.