MP Secretariat Fire Accident :మధ్యప్రదేశ్ సచివాలయంలోని మూడో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కీలక దస్త్రాలు మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం 9గంటల 30 నిమిషాలకు భోపాల్‌లోని సచివాలయంలో జరిగిందీ ప్రమాదం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు.
అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం
శనివారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు వల్లభ్ భవన్(రాష్ట్ర సచివాలయం)లోని బహుళ అంతస్తుల భవనంలోని మూడో ఫ్లోర్లో మంటలు రావడాన్ని కొందరు పారిశుద్ధ్య కార్మికులు గమనించారు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. 20 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు.
సీఎం మోహన్ యాదవ్ స్పందన
రాష్ట్ర సచివాలయ భవనంలో మూడో అంతస్తులో మంటలు చెలరేగాయని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎస్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని మోహన్ యాదవ్ అన్నారు.
పెయింట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం- 11మంది మృతి
Delhi Fire Accident :దిల్లీ అలీపుర్‌లోని పెయింట్స్ ఫ్యాక్టరీలో కొన్నాళ్ల క్రితం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 11మంది మరణించారు. నలుగురు గాయపడ్డారు. నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది.
అసలేం జరిగిందంటే?
అలీపుర్‌లోని ఓ రంగుల పరిశ్రమలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 22 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను రాజా హరిశ్చంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం బాబు జగ్జీవన్‌రామ్ ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదంలో గాయపడ్డ వారిలో ఒక కానిస్టేబుల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరిశ్రమలో మొదట పేలుడు సంభవించిందని చెప్పారు. అనంతరం మంటలు చెలరేగాయని వివరించారు. పేలుడు కారణంగా సమీపంలోని ఇళ్లు, దుకాణాలకు సైతం మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో ఉన్న రసాయనాల వల్ల పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.