Mother Throws Mute Son In Canal :మాటలు రాని ఆరేళ్ల బాలుడ్ని కన్న తల్లే కడతేర్చింది. పుట్టు మూగవాడని, మొసళ్లు ఉన్న కెనాల్లో పడేసింది. ఆదివారం ఉదయం బాలుడి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన బాలుడి తల్లిదండ్రులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
చెందిన రవికుమార్(27) అనే వ్యక్తి భార్య సావిత్రి(26) ఇద్దరు పిల్లలతో దండేలి మండలంలో నివసిస్తున్నాడు. అయితే అతడి పెద్ద కుమారుడు వినోద్(6) పుట్టు మూగ. వినోద్ పరిస్థితి గురించి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అలాంటి బిడ్డను ఎందుకు కన్నావు? అతడిని దూరంగా విసిరేయమంటూ భార్యను వేధించేవాడు రవికుమార్. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య శనివారం గొడవ పెద్దదైంది. దీంతో మనస్తాపానికి గురైన సావిత్రి తన కుమారుడు వినోద్‌ను మొసళ్లు ఉన్న కెనాల్లో పడేసింది. ఈ కెనాల్లో కాళీ నదికి అనుసంధానం అవుతుంది.
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు, గజఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అయితే చీటకటిగా ఉండటం వల్ల సహాయక చర్యలు ఆటంకం కలిగింది. సోమవారం ఉదయానికల్లా బాలుడు మృతదేహాన్ని వెలికితీశారు. అతడి మృతదేహంపై గాట్లు ఉన్నాయి. ఒక చేయి కూడా లేదు. దీంతో మొసళ్ల దాడిలో బాలుడు మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం పరీక్షల కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాలుడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు.